ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నయనతారకి చాలా ప్రత్యేకత ఉంది. నయనతారా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులవుతున్నా ఇంకా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమెతో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్లు సినిమాలు లేక కనుమరుగైపోయారు. నయనతార కెరియర్ కూడా ఒక దశలో ముగుసిందనే అనుకున్నారు. కానీ రాజా రాణి సినిమా ద్వారా ఆమె మళ్ళీ ట్రాక్ లో పడింది.  తెలుగు, తమిళంలో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నయనతార నుండి  ప్రస్తుతం మరో సినిమా రాబోతుంది.


గత కొంత కాలంగా నయనతార కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తుంది. లేడి సూపర్ స్టార్ గా భారీ రెమ్యునరేషన్ చేజిక్కించుకుంటుంది. ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ప్రస్తుతం ఆమె నటించిన "సైరా" చిత్రం మరి కొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా తర్వాతి చిత్రం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.


మిలింద్ రావ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు 'నెట్రికన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. 'రౌడీ పిక్చర్స్ పతాకం'పై ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నారు. పోస్టర్లో టైటిల్ బ్రెయిలీ లిపిలో వ్రాసి ఉంది. దీంతో నయనతార అంధురాలిగా కనిపించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఈ పోస్టర్ లో  కొరడా, సంకెళ్లు కూడా ఉండటంతో భిన్నమైన కాన్సెప్టుతో ఉంటుందని  స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఒక కుక్క కూడా కీలక పాత్రలో కనిపించనుందట.  నిర్మాత విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ నయనతార 65 వ చిత్రం నేను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, అందరి ఆశీర్వాదంతో ఈ సినిమా షూటింగ్ ఈ రోజే మొదలవుతుందని వెల్లడించాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: