అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ,కథనం,ఆర్య, అనుష్క,మాటలు, పాటలు, నేరేషన్ , డైరెక్షన్ ,సినిమాటోగ్రఫీ ,కోరియోగ్రఫీ,ఇవీ , అవీ .... అన్నీ

గమనిక : ముందుగా చెప్పుకోడానికి వీలున్నంత కథ కనపడదు, కనిపించినంతలో, అర్ధమయినంత కథ ఇక్కడ రాస్తున్నాం.

పోస్టర్స్ లో చూసిన విధంగానే కథ అనేది రెండు లోకాలలో మొదలవుతుంది రెండు కథలను విడదీసి చెప్పాలంటే మొదట మనలోకం గురించి చెప్పుకుందాం.

మధు బాల కృష్ణ (ఆర్య) సమాజంలో చిన్న ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికెళ్ళి సహాయం చేసే వ్యక్తిత్వం కలవాడు ఇదే అతన్ని డాక్టర్ అయిన రమ్య (అనుష్క) ప్రేమిస్తుంది. రమ్య తన ప్రేమను మధు బాల కృష్ణ కి చెప్పగానే మధు, రమ్య ప్రేమను తిరస్కరిస్తాడు. కాని అప్పటి నుండి మధు , రమ్యని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇదే విషయాన్నీ రమ్యకి చెప్పగా అప్పటికే తనకి పెళ్లి నిశ్చయం అయ్యిందని రమ్య మధుతో చెప్తుంది. అసలు వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది ఈ కథ...

ఇది మరో లోకంలోని కథ , ఆ లోకానికి రాజు దగ్గర దళపతి కి కొడుకు అయిన మహేంద్ర(ఆర్య) తొలి చూపులోనే వర్ణ (అనుష్క) ని ప్రేమిస్తాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు కాని వర్ణ కి మహేంద్ర అంటే ఇష్టం లేకపోవడం తో వారిరువురు కలిసి ఉండరు. ఇలాంటి సమయంలో అనుకోకుండా మహేంద్ర కాలంలో ప్రయాణించి ఈ లోకంలో ప్రమాదంలో ఉన్న మధు బాల కృష్ణ ను ఒక ప్రమాదం నుండి కాపాడుతాడు అలానే మధు ని తన లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ వర్ణ ని చుసిన మధు ఆశ్చర్య పోతాడు అక్కడ నుండి వర్ణ ఎవరి సొంతం అవుతుంది? రమ్య ఏమవుతుంది? అనేది మిగిలిన కథ....

ఈ చిత్రంలో చాలా మంది కనిపిస్తారు కాని చెప్పుకోదగ్గ పాత్రలలో కనిపించింది మాత్రం ఇద్దరే ఒకరు ఆర్య మరొక అనుష్క. ఆర్య తనేం చేస్తున్నాడో అర్ధం కాకపోయినా ఏదో గొప్పగా చెయ్యడానికి మాత్రం ప్రయత్నించాడు కాని ఆకట్టుకోలేకపోయాడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అసలు బాగోదు. ఒక యోధుడి గా అసలు అనిపించదు. అనుష్క రెండు పాత్రల మధ్య తేడా చాలా బాగా చూపించింది కాని వేరే లోకంలో ఉన్న అనుష్క పరవాలేదు కాని ఈ లోకంలో ఉన్న అనుష్క మాత్రం అనుష్క కెరీర్ లో నే వరస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. అనుష్క కత్తి యుద్ధం నేర్చుకుంది అని ప్రచారం చేసారు కాని అంతగా ఆకట్టుకోలేదు. వీళ్ళు ఇద్దరు కాకుండా ఆ లోకంలో చాలా మంది తెల్ల వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ పాత్రలు అర్ధం కాలేదు, పేర్లు దొరకలేదు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోడానికి ఎక్కువ లేదు .

ఈ విభాగంలో పోజిటివ్ గా చెప్పుకోదగ్గ అంశం అనిరుధ్ అందించిన నేపధ్య సంగీతం. అవును ఇద్దోక్కటే ఈ చిత్రంలో కాస్తో కూస్తో బాగుంటుంది అనిపించే అంశం.

తన కలల ప్రాజెక్ట్ గ పేర్కొన్న ఈ చిత్రంలో కథ కోసం సెల్వ రాఘవన్ కాస్త కూడా కష్ట పడినట్టు కనిపించదు. గ్రాఫిక్స్ మీద పెట్టిన దృష్టి లో పది శతం అయినా కథ లేదా కథనం మీద పెట్టి ఉంటె ప్రేక్షకుడికి కొంత సాంత్వన దొరికేది పోనీ గ్రాఫిక్స్ వర్క్ అయినా బాగుందా అంటే సీన్ కి బ్యాక్ డ్రాప్ కి అసలు సంభంధం ఉండదు. కొన్ని సన్నివేశాలను గ్రాఫిక్స్ కోసమే చిత్రంలో ఉంచారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం దేనికదే సెపరేట్ గా కనిపిస్తుంది కాబట్టి ఎడిటర్ కూడా కట్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు అనిపించదు. కాస్త కట్ చేసి నిడివి తగ్గించి ఉంటె బాగుండేది. ఇలాంటి చిత్రానికి ప్రాణం అయిన సినిమాటోగ్రఫీ గొప్పగా లేదు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు పరవాలేదు. ఫైట్స్ బాగోలేదు.

పలు మార్లు మొదలయ్యి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవతార్ లాంటి సినిమా అనే లేబుల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని అవతార్ తో పోల్చిన వారందరు ఈ చిత్రాన్ని తప్పక చూడండి.

ఇక విశ్లేషణ లోకి వెళ్తే, ముందుగా సెల్వ రాఘవన్ అనుకున్న పాయింట్ ని సరిగ్గా చూపించలేకపోయారు అనాలనే ఉంది కాని దానికన్నా ముందు ఒక ప్రశ్న ఉంది అసలు ఏదైనా పాయింట్ అనుకున్నారా? పోనీ ఏదైనా అనుకుంటే ఆ పాయింటే నే చిత్రం గా మలిచారా సందేహం కూడా వస్తుంది ఎందుకంటే నిజానికి ఈ చిత్రాన్ని 2006 లోనే కార్తి ని హీరో గా పెట్టి తెరకెక్కించాలని అనుకున్నారు. దాదాపుగా ఏడూ సంవత్సరాల ఈ కథలో కాస్తయినా క్లారిటీ ఉండదు. సరిగ్గా చెప్పాలంటే అసలు కథ కూడా ఉండదు. చూసే ప్రేక్షకుడికి క్లారిటీ లేకపోతే ఇంటెలిజెంట్ మూవీ అనుకోవచ్చు కాని తీసే దర్శకుడికి క్లారిటీ లేకపోతే ఏమనాలి?

"భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్లు ఉన్నాయి, ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి కాదు" అన్న ఐన్ స్టీన్ వాక్యం ఆధారంగా తెరకెక్కించారని మొదట్లో చెప్పారు కాని భూమి లాంటి ఏ గ్రహానికి వెళ్ళినా తెలుగు/తమిళం మాట్లాడుతారని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్నీ మరిచిపోయారు. పైగా అసలు మనతో పోల్చుకోలేని యాక్టర్స్ ని పెట్టడంతో ప్రేక్షకుడు అసలు కనెక్ట్ అవ్వలేడు. పైగా సెట్ లు కూడా అలానే ఉండటంతో ప్రేక్షకుడికి చిత్రానికి సంభంధం లేకుండా పోతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న ఒక లోకం మరో లోకం వాటి మధ్య సంభంధం కాన్సెప్ట్ కూడా అలానే ఉంటుంది. ఆ లోకాన్ని చూపించినప్పుడు బ్యాక్ డ్రాప్ లో చూపించే "అవతార్" పండొరా లాంటి విజువల్స్ కి తెర మీద జరిగే సన్నివేశానికి అసలు సంభంధం ఉండదు. ఆ లోకంలో దైవం గా కొలవబడే "అమ్మ" అనే పాత్ర హావభావాలు "వర్ణ"నాతీతం. గ్రాఫికల్ వండర్ అని పిలువబడే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కి పాత్రలకు, ప్రేక్షకులకు, నటుల హావభావాలకు ఇలా వేటికీ మరొకదానితో సంభందం ఉండదు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు శ్వేత "వర్ణి"తుడయ్యాడు(తెల్లబోయాడు). ఈ చిత్రంలో మాకు అనిపించిన బెస్ట్ పార్ట్ ఏదయినా ఉందంటే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్యలో కాసేపు "విశ్రాంతి" ఇవ్వడం. మాకు తెలిసి మన లోకం కాకుండా రెండు లోకాలు ఒకటి స్వర్గం రెండోది నరకం .. ఈ చిత్రం చూడకుండా ఉండటం స్వర్గం అయితే థియేటర్ లో కనిపించేది నరకం. ఇంతే ఇంతకన్నా ఎం చెప్పలేము అయినా సినిమా బాగుండాలంటే కావలసింది "ఖర్చు" కాదు "కంటెంట్" అని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. కాబట్టి ఇకనయిన ఖర్చు మీద కాకుండా కథ మీద దృష్టి సారిస్తారేమో అని ఆశిద్దాం.

ఈ చిత్రంలో చూడటానికి ఏమి లేదు, లేదు ఏదో ఒకటి ఉంటుంది అని మీరు అనుకుంటే ఈ చిత్రానికి వెళ్ళండి వెళ్లి ఏముందో తెలుసుకోండి మీకేమయిన కొత్త విషయాలు తెలిస్తే ఈ రివ్యూ కింద కామెంట్ చెయ్యండి..

Arya,Anushka Shetty,Selva Raghavan,Prasad V Potluri,Harris Jayarajవర్ణ - వెళ్ళిన వాళ్ళకి రంగు పడుద్ది!!

మరింత సమాచారం తెలుసుకోండి: