వేణు మాధవ్ పరిచయం అక్కర్లేని పేరు.  తనదైన శైలిలో కామెడీ చేస్తూ మెప్పించాడు.  1996లో వచ్చిన సంప్రదాయం సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మెప్పించారు.  దాదాపు 300 సినిమాలు చేసిన వేణు మాధవ్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు.  కమెడియన్ పాత్ర ఏదైనా సరే దానికి జీవం పోసేవాడు.  తనకు కష్టసాధ్యం అన్నది లేదు.  రకరకాల పాత్రలు వేశారు.  మెప్పించారు.  మనసారా నవ్వించారు.  ఒక మనిషిని ఏడిపించడం ఈజీనే.  కానీ, మనిషిని నవ్వించడం మాత్రం చాలా కష్టం అని చెప్పొచ్చు.  


మనిషిని నవ్వించడంలోనే తనకు ఆనందం ఉందనేవారు వేణు మాధవ్.  మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.  మెగా కుటుంబంతో కలిసి ఎన్నో సినిమాలు చేశారు.  1997 లో వచ్చిన గోకులంలో సీత సినిమాతో పవన్ తో కలిసి చేసిన మొదటి సినిమా.  అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది.  గోకులంలో సీత, తొలిప్రేమ, తమ్ముడు, బంగారం వంటి సినిమాల్లో నటించాడు.  అటు మెగాస్టార్ తో కలిసి కూడా సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ ఇలా అందరితో కలిసి సినిమాలు చేశారు.  


ప్రతి ఒక్కరితో మంచి అనుబంధం కలిగి ఉన్న వేణు మాధవ్.. సినిమా రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా మంచి అనుబంధాలను కలిగి ఉన్నాడు.  సినిమా ప్రపంచంలో విజయాలు సాధిస్తూ వస్తున్నా.. రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయాడు.  అదొక్కటే వెలితిగా మిగిలిపోయింది.  సినిమా రంగంలోకి రాకముందు వేణుమాధవ్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించాడు.  అంచలంచెలుగా ఎదగడం మొదలుపెట్టాడు.  


ఆఫీస్ కు వచ్చే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారు.  అందరివాడుగా పేరు తెచ్చుకున్న వేణు మాధవ్ ఎప్పటికైనా రాజకీయాల్లో రాణించాలని, తన సొంత ఊరు కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు.  తనకు అడుగులు నేర్పిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనీ అనుకున్నాడు.  2014లో చాలా తీవ్రంగా కృషి చేశాడు. కానీ సాధ్యం కాలేదు.  ఆ తరువాత క్రమంగా అయన ఆరోగ్యం క్షిణించడం మొదలుపెట్టింది.  2015లో వచ్చిన రుద్రమదేవి తరువాత అయన మరో సినిమాలో నటించలేదు.  రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా గెలవాలన్న వేణుమాధవ్ కోరిక తీరకుండానే పాపం కన్నుమూశాడు.  వేణుమాధవ్ మృతిపట్ల తెలుగు సినిమా పరిశ్రమ సంతాపాన్ని తెలియజేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: