టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్లు తమదైన కామెడీ నవ్వులు పూయించారు.  రేలంగి, రాజబాబు, పద్మనాభం తర్వాత ఆ స్థాయిలో బ్రహ్మానందం కామెడీ  పండిస్తున్న సమయంలో ‘సాంప్రదాయం’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు వేణు మాధవ్. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకసారి రవీంద్ర భారతిలో వేణు మాధవ్ ఒక బొమ్మతో వెంట్రిలాక్విజం చేస్తు..మిమిక్రితో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. 

ఆ ప్రదర్శన చూసిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. కృష్ణారెడ్డి తీసిన కామెడీ సినిమాల్లో వేణు మాధవ్ కి ప్రత్యేక పాత్రలు ఇచ్చి మంచి నవ్వులు పూయించారు.  వేణు మాధవ్ కి పవన్ కళ్యాన్ తో ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తొలిప్రేమతో ఇద్దరికీ ఎంతో పేరు వచ్చింది.  ఇక టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు బండ్ల గణేష్. టాలీవుడ్ లో బండ్ల గణేష్, వేణు మాధవ్ కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వేణుమాధవ్ మృతిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ విచారం వ్యక్తం చేశారు.

వేణుమాధవ్ లేడన్న వార్త తనను చాలా బాధించిందని, ఈరోజు చాలా దుర్దినం అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘లేడు’ అన్న మాట అనాలంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని, ఆ మాట నోట రావడం లేదని బాధతో అన్నారు. ఈ మధ్య వేణుమాధవ్ ఆరోగ్యం బాగుండకపోతే వాళ్లింటికి వెళ్లానని, ‘జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం కాపాడుకో’ అని చెప్పానని.. ‘నాకు ఏం కాదు’ అని వేణు చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: