పద్మశ్రీ,, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్న లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కుచిత్రసీమకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన అమితాబ్ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. రెండు తరాలను తన నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ ఏకగ్రీవంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించడం ఆనందంగా ఉంది అంటూ  కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ఈ రోజు ట్విట్ చేసారు. 

ఈ వార్తతో బాలీవుడ్ సినీ లోకంతో పాటు, యావత్ బిగ్ బి అభిమానులు  సంతషంలో మునిగిపోయారు. భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా  సోషల్ మీడియా వేదికగా అమితాబ్ పై అభినందనల వర్షం కురుస్తోంది. ఆయనకు దక్కిన ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ లాల్, కింగ్ నాగార్జున ఇలా ఒక్కొక్కరు తమ అభినందనలను తెలియజేశారు.మెగాస్టార్ ట్వీట్ చేస్తూ 1969లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారని, గడిచిన యాభై వసంతాల కాలంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారని మెగాస్టార్  పేర్కొన్నారు. యుక్తవయసులో యాంగ్రీ యంగ్ మెన్ అనిపించుకున్న అమితాబ్ జీ.. ఇప్పుడు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని, తాను పోషించే ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని కొనియాడారు.

సైరా... నరసింహారెడ్డి' చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ చిత్రం విడుదల కాబోతున్న శుభ తరుణంలో అమితాబ్ జీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని కలిగించిందని చిరు పేర్కొన్నారు.ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందిస్తూ ''అమితాబ్ జీకి అభినందనలు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడానికి మీరు సరైన అర్హులు'' అని పేర్కొన్నారు.

రజనీకాంత్ చేసిన ట్వీట్ పై తమిళ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ అమితాబ్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇక  బిగ్‌బీ అంటేనే అలుపెరుగని కెరటం అని, ఆయన నట జీవితం గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం అని, నటనలో ఆయన తనకంటూ ఓ ఒరవడిని సృష్టించుకొన్నారని పవన్ కొనియాడారు. వారికి జనసైనికులు, నా తరఫున హృదయపూర్వక అభినందనలు అని పవన్ కూడా పేర్కొన్నారు.దాదా సాహెబ్ పురస్కారం అర్హత కలిగిన వ్యక్తినే వరించిందని మోహన్‌లాల్ పేర్కొనగా, అమితాబ్ తన నటనతో కోట్లాది మందికి వినోదం పంచడంతో పాటు అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, అలాంటి మహా నటుడికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున ట్విట్టర్ లో తన ట్వీట్ పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: