ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఆశ్వీయుజమాసంలో వచ్చే ఈ శరన్నవరాత్రులలో అమ్మ ను పూజించడం అంటే అమ్మవారిని మేల్కొల్పడం అని కొందరు అంటారు. రావణుడుతో యుద్ధానికి సిద్ధం అవుతున్న శ్రీరాముడు ఆ యుద్ధంలో విజయం కోసం చండీహోమాన్ని నిర్వహించి అమ్మ ఆశీర్వాదం పొంది ఆ తరువాత రావణుడుని యుద్ధంలో సంహరించాడు అని అంటారు. 

ఈరోజు బాల త్రిపుర సుందరి గా పూజలు అందుకుంటున్న అమ్మవారు అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించి కనిపిస్తారు. ఈరోజు ఈ రూపంతో ఉన్న తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత అని వేదాలు చెపుతున్నాయి. షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు. 

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడుని కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో ఈమె సంహరించిందని చెపుతారు. ఈమె చూడటానికి బాలగా కనపడుతున్నా మహా శక్తికి మారురూపం. ఈరోజు ఈ రూపంలో ఉన్న అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.

ఈరోజు కొన్ని చోట్ల అమ్మను శైలపుత్రి గా ఆరాధిస్తారు. శైలపుత్రి గా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. క్రీస్తుశకం 6వ శతాబ్దం నుండి దేవి నవరాత్రులు మనదేశంలో జరిగిన ఛారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొదట్లో రాజప్రసాదాలకు మాత్రమే పరిమితం అయిన దేవీ ఆరాధన ఆ తరువాత కాల క్రమంలో సామాన్యులకు కూడ చేరువైంది. ఈరోజు అమ్మవారికి పూజ అనంతరం బెల్లపు పొంగలి నివేదన చేసి అమ్మ ఆశీర్వాదం పొందుదాం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: