ఒక్కసారి ముఖానికి మేకప్ వేసుకొని హీరోయిన్ అయ్యాక సినిమాలకంటే యాడ్ ఫిలింస్ లోనే కోట్లు సంపాదించుకుంటారు. అయితే ఆ కోట్లు సంపాదనలోనే తేరుకోని సమస్యలు ఎదురవుతాయన్న విషయం కొందరికే తెలుసు. ఇక ఒకప్పడు సౌత్ లో స్టార్ హీరోయిన్లు గా చలామణి అయిన రాశి, రంభ వెండితెరపై కనిపించడం మానేశారు. కానీ బుల్లితెరపై మాత్రం వీళ్ళ హంగామా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా ప్రకటనల టైమ్ వచ్చిందంటే చాలు "కలర్స్" అంటూ ప్రత్యక్షమైపోయారు వీళ్ళీద్దరూ. మేము బరువు తగ్గామని, అందరూ తగ్గొచ్చంటూ కలర్ ఫుల్ గా ఊరిస్తుంటారు. ఇప్పుడిదే వీళ్ళీద్దరికి చుక్కలు చూపిస్తుంది. 

కలర్స్ వెయిట్ లాస్ కార్యక్రమం చూసి అందులో చేరి మోసపోయిన ఓ వ్యక్తి విజయవాడ కన్జూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును సానుకూలంగా పరిశీలించిన కోర్టు.. కలర్స్ సంస్థకు జరిమానా విధించింది. కస్టమర్ చెల్లించిన 74,652 రూపాయల మొత్తాన్ని 9శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, వినియోగదారుల సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయల్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

కలర్ సంస్థకు ఫైన్ విధించిన కోర్టు... రాశి, రంభ నటించిన యాడ్స్ పై నిషేధం విధించింది. వాటిని ప్రసారం చేయొద్దని సంస్థకు ఆదేశించింది. అంతేకాదు రాశి, రంభపై కోర్టు అక్షింతలు వేసింది. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, యాడ్ ఫిలింస్ ఒప్పుకునే ముందు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో ఆలోచించాలని సూచించింది. అంతేకాదు ఇప్పటి నుంచి ఇలాంటి యాడ్స్ లో నటించిన వాళ్ళెవరైనా జరిమానాలు తప్పవని క్లారిటి ఇచ్చింది.
ప్రస్తుతానికి రంభ, రాశిలకు ఎలాంటి ఫైన్ విధించని కోర్టు, మొదటి తప్పుగా వాళ్ళీద్దరికీ గట్టిగా అక్షింతలు వేసింది. అయితే కలర్స్ కార్యక్రమం అనేది చాలా చిన్నది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రస్తుతం చాలా రకాల యాడ్స్ టీవీల్లో వస్తున్నాయి. వీటిపై ప్రజలే స్పందించాలి. సాక్ష్యాలతో కన్జూమర్ కోర్టును ఆశ్రయించాలి. ప్రజల్లో ఈ తరహా చైతన్యం వచ్చినప్పుడే కార్పొరేట్ సంస్థలు కంట్రోల్ లో ఉంటాయని స్పష్టం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: