శరన్నవరాత్రులలో మూడవరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియనాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే అని అంటారు. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వేదాలు చెపుతున్నాయి. ఈరోజు అమ్మవారు గాయిత్రి దేవిగా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.

గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. 

ఈమెను ధ్యానిస్తే అనంతం మంత్ర శక్తి కలుగుతుంది. అశ్వయుజ శుద్ధ విదియ నాడు కనకదుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణిగా గాయిత్రి దేవిని ఈరోజు సాధకులు ఆరాధిస్తారు. మన బుద్ధి శక్తులను ప్రచోదనం చేసి మన ఆలోచనలను విస్తృతం చేసే తల్లిగా గాయిత్రి దేవిని ఆరాధిస్తే మన బుద్ధికుసులత పెరుగుతుంది ఈ తల్లిని స్పూర్తిగా తీసుకుంటే ప్రతి మహిళా గుణవంతు రాలై తేజోవంతురాలై రాణిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. 

అమ్మవారిని ఆరాధించడం అంటే కేవలం పూజా ద్రవ్యాలను సమర్పించి స్తోత్రాలను చేస్తే అమ్మ పలకదు. దేవీ తత్వాన్ని అర్ధం చేసుకుని సాటివారికి మానవత్వంతో సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే అమ్మ అనుగ్రహిస్తుంది. ఈరోజు గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి రవ్వ కేసరి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: