సినిమాలో అయిదు పాటలు చేసినవాళ్లు ఆరో పాట కూడా చేయగలరు. అన్ని చేసిన సంగీత దర్శకుడికి ఆ ఒక్కటీ కష్టమైపోదు. అయినా కూడా ఓ రీమిక్స్ పాట ఎందుకు ఉంటోంది చాలా సినిమాల్లో! అది అవసరమై పెడుతున్నారా లేక క్రేజ్ కోసం పాత పాటల్ని వాడేస్తున్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా ఓ పాత పాటను రీమిక్స్ చేసి సరదాగా పెట్టేవారు సినిమాల్లో. కానీ గత కొంతకాలంగా ఇది ఎక్కువైపోయింది. నితిన్ తొలిప్రేమలోని పవన కళ్యాణ్ పాటను పెట్టుకున్నారు. అల్లరి నరేశ్ కోసం ప్రేమయుద్ధంలోని నాగార్జున పాటని రీమిక్స్ చేసి పెట్టారు. ఇక రామ్ చరణ్ అయితే రీమిక్స్ కింగ్. అతడి సినిమాలో చిరంజీవి పాటలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. రచ్చలో వానా వానా వెల్లువాయె అంటూ చిందులేశాడు. నాయక్ లో శుభలేఖ రాసేసుకున్నాడు. ఆ పాటను సరిగ్గా చేయకపోవడంతో కాస్త విమర్శలు వచ్చాయి. ఇళయరాజా లాంటి గొప్ప సంగీత దర్శకుడి పాటను రీమిక్స్ చేసినప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలంటూ కొందరు కాస్త ఘాటుగానే విమర్శించారు. ఫీలయ్యాడో ఏమో... ఆ తరువాత తగ్గించాడు. అయితే దర్శకుడు మారుతికి కూడా రీమిక్స్ పిచ్చి పట్టుకున్నట్టు. ప్రేమకథా చిత్రమ్ లో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవిల 'వెన్నెలైనా చీకటైనా' పాటని పెట్టాడు. ఇప్పుడు కొత్త జంట చిత్రం కోసం చిరంజీవి నటించిన ఖిలాడీ నబర్ 786 చిత్రంలోని పాటను రీమిక్స్ చేయిస్తున్నాడు. చిన్న సినిమాలు తీసినా వెరైటీగా తీసి పేరు తెచ్చుకోవడం మారుతి స్పెషాలిటీ. అలాంటివాడికి కూడా ఇలా రీమిక్స్ పాటలు ఎందుకవసరమవుతున్నాయో అని కామెంట్ చేస్తున్నవాళ్లు లేకపోతేదు. అయితే బహుశా మారుతి చిన్న హీరోల సినిమాలతో వాళ్ల వెనకున్న పెద్దవాళ్లను పడెయ్యాలని చూస్తున్నాడేమో అనిపిస్తోంది. ప్రేమకథా చిత్రమ్ సుధీర్ బాబు సినిమా కాబట్టి, అందులో కృష్ణ పాటను పెట్టేశాడు. అది చూసి పెద్దాయన హుషారైపోయాడని సమాచారం. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాలో చిరంజీవి పాటను పెట్టేసి మెగాస్టార్ ని కూడా ఖుషీ చేసేద్దామని ప్లాన్ వేసి ఉంటాడు. అయినా వీళ్లు ఎన్ని చిన్నెలు చేసినా, ఒరిజినల్ ఒరిజినలే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: