శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.

“ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ - నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ - సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ - భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ” అంటూ అమ్మ వారిని ఈ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.

ఆదిభిక్షువైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన దేవత అయిన అన్నపూర్ణదేవిని పూజిస్తే మేథాశక్తి వృద్ధి చెందుతుంది. మధురభాషణ సమయస్ఫూర్తి వాక్ శుద్ధి ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు ఈ రోజు తనను పూజించే భక్తులను  సకల సంపూర్ణునిగా అన్నపూర్ణదేవి అనుగ్రహిస్తుంది. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని పూజిస్తే ఆకలిదప్పుల వంటి బాధలు ఉండవు. 

సదాశివునికి ఆహారం అందిస్తూ దర్శనమిచ్చే అన్న పూర్ణ దేవిని ఆరాధిస్తూ ఏ గృహిణి అయినా శుచిగా  ఆరోగ్యానికి మేలు చేసేల వంట వండుతూ కుటుంబ సభ్యులకు అన్నపూర్ణ దేవి లా మారాలి అన్న తత్వం ఈ అవతారంలో కనిపిస్తుంది. అంతేకాదు అతిధులకు అభాగ్యులకు ఆహారం అందించే ప్రతి గృహిణికి ఆమె కుటుంబంతో పాటు సమాజం కూడ రుణపడి ఉంటుంది అన్న సందేశం ఈ నాటి అమ్మ అవతారంలో కనిపిస్తుంది.  అన్నపూర్ణ దేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. ఈరోజు అమ్మకు పెరుగుతో చేసిన దద్దోజనం నివేదన చేస్తారు. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపింఛి నేడు అమ్మను కొలిస్తే అన్ని శుభాలు కలుగుతాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: