2019 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాలు సాహో మరియు సైరా. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. రిలీజైన రోజే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఫుల్ రన్లో సాహో సినిమా అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్లకు 80 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. 
 
సాహో తరువాత దాదాపు అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమాకు సాహోతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది. కానీ సైరా సినిమా కలెక్షన్లు మాత్రం రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాలలో మాత్రం సైరా సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. విడుదలకు ముందు సైరా సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడినా ఆ అంచనాలకు తగినట్లు కలెక్షన్లు మాత్రం రావటం లేదు. 
 
సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించటంతో బాలీవుడ్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని చిత్ర యూనిట్ భావించింది. కానీ సైరా కలెక్షన్లు మాత్రం బాలీవుడ్ లో దారుణంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడులో కూడా సైరా పరిస్థితి ఇదే విధంగా ఉంది. కర్ణాటకలో మాత్రం మిగతా ప్రాంతాలతో పోలిస్తే కలెక్షన్లు కొంచెం మెరుగ్గానే వస్తున్నాయి. 
 
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సైరా నరసింహా రెడ్డి ఫుల్ రన్లో ఎంతమేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా ప్రాంతాలలో సైరా నరసింహా రెడ్డి సినిమాకు నష్టాలు తప్పవని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. నయనతార, తమన్నా, అనుష్క, సుదీప్, జగపతిబాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: