తెలుగు సినిమాలకు బాగా కలిసి వచ్చే పండగలు విజయదశమి.. దీపావళి.. సంక్రాంతి. ప్రతీ సంవత్సరం ఈ మూడు సీజన్లలో రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టవచ్చన్నది మన ఫిలింమేకర్స్ ప్లాన్స్. ఈ పండగల రోజుల్లో అందరికి సెలవులు వుండటంతో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. దీంతో ఆ సమయాల్లో రిలీజ్ అయ్యే సినిమాలు హిట్ టాక్ ని తెచ్చుకుంటే భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతుంటాయి. అంతేకాదు నిర్మాతలకు బాగా లాభాలు వస్తుంటాయి. అందుకే నిర్మాతలు పండగ సీజన్ ని నమ్మి సినిమాల్ని బరిలోకి దింపాలని పోటీపడుతుంటారు.

అలా ఈసారి కూడా దసరా.. దీపావళి సీజన్ ఇప్పటికే మొదలైంది. ఈ రెండు పండగల్ని క్యాష్ చేసుకుని కోట్లు సంపాదించుకోవాలని ఈ సారీ కూడా చాలా సినిమాలే పోటీపడుతున్నాయి. కానీ సంగతి ఎందరికి తెలుసు? ఇప్పటికే రిలీజైన 'సైరా నరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ హవా మాత్రమే కనిపిస్తోంది. ఈ సినిమా తరవాత మొత్తం 10 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ రేస్ లో భాగంగా శనివారం గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ 'చాణక్య' ప్రేక్షకుల ముందుకొచ్చి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. నవీన్ విజయకృష్ణ నటించిన 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమా కూడా ఇదే రోజు విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉందన్న టాక్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇక ఈనెల 8న ( దసరా రోజు ) 'ఎవ్వరికి చెప్పొద్దు' విడుదల కాబోతోంది. 

 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్  నటించిన 'ఆర్.డి.ఎక్స్ లవ్' ఈనెల 11న రిలీజ్ అవుతుండగా ఇదే రోజున సిద్ధార్ధ్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'వదలడు' రిలీజ్ అవుతోంది. ఇక దీపావళి బరిలో అల్లరి అల్లుడు.. విజయ్ నటించిన 'విజిల్'.. కార్తి సినిమా 'ఖైదీ'.. బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. '90ఎం.ఎల్' రిలీజ్ కి పోటీపడుతున్నాయి. ఈ దసరా బరిలో దిగిన సినిమాలు అంతగా క్రేజ్ లేని సినిమాలే. వీటికి సరైన ప్రచారం కూడా లేదు. పైగా హిట్టు టాక్ తో దసరా సెలవుల్ని 'సైరా'నే ఆక్రమించేలా కనిపిస్తోంది. దసరా.. దీపావళికి వస్తున్నామని సంబరపడినా.. ఇతర సినిమాలని మాత్రం ప్రేక్షకుడు పట్టించుకునేలా లేదు. ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు కూడా ఎవరికీ తెలియడం లేదు. అంత దారుణంగా ప్రచారంలో వెనకబడ్డారు. చిన్న సినిమాలకు ఇదే ప్రధాన సమస్యగా మారింది. అందుకే ఈసారి దసరా, దీపావళి అంతగా ఆసక్తికరంగా అనిపించడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: