దసరా అంటే  శక్తికి  ఉతత్సవం ఆత్మా విశ్వాసంతో  ఒక మంచి ప్రయత్నం చేస్తే  ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం సాధిస్తుంది అన్న అర్ధం విజయదశమిలో ఉంది. తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తు శరన్నవరాత్రులు పూర్తి అయిన తరువాత జరుపుకునే ఈ విజయదశమి వెనుక అనేక పురాణ గాధలు  ఉన్నాయి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని  అంటారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమి విజయానికి సంకేతంగా భావిస్తారు. ఎటువంటి తిథి వారం తారాబలం గ్రహబలం ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు  ఏకార్యక్రమం చేపట్టినా ఆ కార్యం విజయ వంతం అవుతుందని మన నమ్మకం.

విజయదశమినాడు నిర్వహించే శమీపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి తిరిగి ఆయుధాలను పొంది శమీవృక్ష రుపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం  సాధించినట్లు మహాభారతంలో చెప్పపడింది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితా దేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ’ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సర్వవిజయాలు కలగడమే కాకుండా  అమ్మవారి కృప శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.

సాధారణంగా విజయదశమినాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈరోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈరోజు ప్రారంభిస్తే ఆ విద్యలో నిష్ణాతులు అవుతారని అంటారు అంతేకాదు. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది అని నమ్మకం. 

 పురాతన కాలంలో జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందని పెద్దల నమ్మకం అంతేకాదు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని శత్రువుల్ని నశింపజేసేది. పూర్వ కాలంలో రాజులు తమ దండయాత్రలను ఈ విజయదశమి నుంచి ప్రారంభించే వారని చరిత్ర చెపుతోంది. ఇలా ప్రతి వ్యక్తి వారి జీవితంలో విజయం సాధించడానికి స్పూర్తి ఈ దసరా పండుగలో ఉంది. ఈ రోజు ఉదయించిన విజయదశమి అందరికి సకల విజయలు ఆనందాలు  కలుగచేయాలని కోరుకొంటూ ఇండియన్ హెరాల్డ్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు అందిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: