టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, తొలిసినిమా తోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత మరొక్కసారి కూడా ఎన్టీఆర్ తోనే సింహాద్రి అనే మాస్ సినిమా తీసిన రాజమౌళి, ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించి మంచి హిట్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత నితిన్ హీరోగా ఆయన తీసిన సై మంచి విజయాన్ని అందుకోగా, అనంతరం ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ఛత్రపతి సినిమా, అప్పట్లో మంచి మాస్ హిట్ గా నిలిచి రాజమౌళి తో పాటుగా ప్రభాస్ కు కూడా కెరీర్ పరంగా మంచి సక్సెస్ ని అందించింది. 

ఇక ఆ తరువాత రవితేజ డ్యూయల్ రోల్ లో విక్రమార్కుడు, అలానే ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ హీరోగా యమదొంగ సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన రాజమౌళి, అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర సినిమాతో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు. ఆ తరువాత సునీల్ తో మర్యాద రామన్న, అలానే నాని మరియు సమంతల కలయికలో ఈగను ప్రధాన పాత్రధారిగా పెట్టి తెరకెక్కించిన ఈగ సినిమాలతో అద్భుత విజయాలు అందుకున్నారు రాజమౌళి. ఇక వాటి అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న రాజమౌళి, ప్రభాస్ మరియు అనుష్కల కలయికలో బాహుబలి సినిమాను తెరకెక్కించడం, అది అత్యద్భుత విజయాన్ని అందుకుని మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా టాలీవుడ్ సినిమా కీర్తిని పెంచడం జరిగింది. 

ఇక దానికి సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా, అంతకుమించి దాదాపుగా రెండువేల కోట్ల రూపాయల కలెక్షన్ ని అందుకుని, రాజమౌళి పేరుని విశ్వవ్యాప్తంగా విపరీతంగా మరు మ్రోగేలా చేసాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టి స్టారర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి, కెరీర్ పరంగా తీసిన 11 సినిమాల్లో, ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా పొందకుండా షూర్ సక్సెస్ రాజమౌళి అనే పేరుతో ముందుకు సాగుతున్నారు. ఇక నేడు 45 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్న రాజమౌళి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: