సినిమాలకు సంక్రాంతి ముఖ్యమైన పండుగ. తెలుగు సినిమాలకే తీవ్రమైన పోటీ ఉండే సమయంలో తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వినయ విధేయ రామ, ఎఫ్2, ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయితే డబ్బింగ్ సినిమా రజినీకాంత్ పెటా కూడా విడుదల చేశారు. దీంతో మన తెలుగు సినిమాలకు రావల్సిన కలెక్షన్లు కొంతమేర ఆ సినిమా కొల్లగొట్టింది. కలెక్షన్లపరంగా ఇది తెలుగు సినీ పరిశ్రమకు జరుగుతున్న నష్టమేనని చెప్పాలి.

 


డబ్బింగ్ సినిమాల విడుదల తప్పులేదు కానీ.. మరీ సంక్రాంతి సీజన్లో విడుదల చేయటమేంటో అర్ధంకాని ప్రశ్న. దీనిపై తెలుగు సినిమా పెద్దలు కూడా దృష్టి పెట్టకపోవడం విచారకరం. తమిళంలో సంక్రాంతికి వేరే భాషా సినిమాలను విడుదల కానివ్వరు. వారికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తమిళం కన్నా పెద్ద పరిశ్రమ అయిన తెలుగులో మాత్రం ఏ నిబంధనా పెట్టడం లేదు. వచ్చే సంక్రాంతికి అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, వెంకీ మామ, ఎంత మంచివాడవురా అనే నాలుగు సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటే రజినీకాంత్ దర్బార్ కూడా లైన్ లోకి రావడంపై తెలుగు సినీ పెద్దలు ఆలోచించాలి. నాలుగు తెలుగు సినిమాలే కలెక్షన్లను పంచుకోవాల్సి వస్తుంటే డబ్బింగ్ సినిమాకు వెళ్లే కలెక్షన్లతో మనకు మరింత నష్టం.

 


సాహో, సైరా వంటి భారీ సినిమాలు అక్కడ రిలీజ్ అయితే తమిళ స్టార్స్ రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య కనీసం ఓ మెసేజ్ కూడా ఇవ్వలేదు. కానీ వారి సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి కలెక్షన్లు సాధిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు సినీ పెద్దలు దృష్టి పెట్టి దర్బార్ విడుదల తేదీ మార్చుకనేలా చూడాల్సిన అవరసరముంది. సినిమాలకు సంబంధించి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారు కూడా వీటిని పట్టించుకోకపోవడం విచారకరం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: