వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకోసారి చాలతెలివిగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ తెలివితేటలు వల్ల వర్మ ఏదైనా ఒక కామెంట్ చేసాడు అంటే నిముషాలలో ఆ కామెంట్ వైరల్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భమే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ రిపీట్ చేసాడు. 

నిన్న జరిగిన చిరంజీవి జగన్ ల సమావేశం పై స్పందిస్తూ వర్మ ‘వావ్ వావ్ 151 విత్ 151’ అంటూ ట్విట్ చేసి వీరిద్దరి కలయిక పై తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. ఎన్నో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కుని చిరంజీవి 151 సినిమాలు నటించడం ఒక చరిత్ర అయితే మరెన్నో వ్యతిరేక పరిస్థితులతో పోరాడుతూ గత ఎన్నికలలో జగన్ తన పార్టీకి 151 మంది ఎమ్.ఎల్.ఎ. లను గెలిపించుకోవడం ఒక అద్భుతం అంటూ వర్మ కామెంట్ చేసాడు.

సాధారణంగా మెగా ఫ్యామిలీని ముఖ్యంగా చిరంజీవి పవన్ లను విపరీతంగా టార్గెట్ చేసే వర్మ ఇలా ఎవరు ఊహించని విధంగా యూటర్న్ తీసుకుని చిరంజీవిని పొగడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనితో చిరంజీవి లానే వర్మ కూడ తాను కూడ అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఇప్పుడు వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో చాలామంది వర్మ తెలివితేటల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరికొందరైతే వర్మ తన తెలివితేటలను ఇలాంటి ట్విట్స్ పై వృథా చేసుకోకుండా మంచి సినిమాలు తీసి ఉంటే దర్శకుడుగా వర్మ ఎప్పుడో టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిపోయి ఉండేవాడు అంటూ చురకలు అంటిస్తున్నారు. అయితే వర్మ ఎవరి మాట వినని ‘సీతయ్య’ అన్న విషయం ఓపెన్ సీక్రెట్ కావడంతో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మారి మంచి సినిమాలు తీస్తాడో అతడికే తెలియని పరిస్థితి..    


మరింత సమాచారం తెలుసుకోండి: