ఒకప్పుడు దిల్ రాజు అంటే ప్లానింగ్, ప్లానింగ్ అంటే దిల్ రాజు అన్నట్టుగా ఉండేది. సినిమా ముహూర్తం దగ్గర్నుంచి రిలీజ్ వరకూ అతడి ప్లానింగ్ అద్భుతంగా ఉండేది. ఒడిదుడుకులు అనేవి అతడికి తెలియవు. పక్కా ప్రణాళికలతో అడుగులు వేసేవాడు. అనుకున్న సమయానికి అన్ని పనులూ పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడలా లేదు. దిల్ రాజు తడబడుతున్నాడు. ప్లానింగులో పొరబడుతున్నాడు. ఇది మేం అంటున్నమాట కాదు. ఇండస్ట్రీలోని వారు అంటున్నమాట. దిల్ రాజును చూసి ప్లానింగ్ అంటే ఏంటో తెలుసుకున్న నిర్మాతలు చాలామందే ఉన్నారు. కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేవాళ్లు సైతం దిల్ రాజు పనితీరును పరిశీలిస్తుంటారు. అలాంటివాడు ఎందుకిలా తడబడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలీ డిస్కషనంతా ఎందుకు వచ్చిందో తెలుసా? అతడి సినిమాలు విడుదల విషయంలో నానా తంటాలు పడుతున్నాయి. ఓ పట్టాన బయటకు రాలేక పురుటి నొప్పులు పడుతున్నాయి. రామయ్యా వస్తావయ్యా చిత్రాన్నే తీసుకుంటే వారానికో తేదీ చెప్పినట్టు చెప్పేవారు. దర్శకుడు హరీష్ శంకర్ అయితే... అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అంటూ ఊదరగొట్టేసేవాడు. కానీ ఆ సినిమా ఎప్పటికి బయటకు వచ్చిందో, వచ్చాక ఏమయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవడు విషయంలో కూడా ఇదే గొడవ. వస్తుంది వస్తుంది అని ఆగస్టు నుంచి చెబుతున్నారే కానీ వచ్చిందీ లేదు, జనం చూసిందీ లేదు. ఇందులో దిల్ రాజు తప్పేముంది, సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఇలా జరుగుతోంది అనవచ్చు. ఉద్యమం గురించి రాజుకు తెలియదా? తెలిసీ ఎందుకు తేదీలు ప్రకటిస్తున్నట్టు? రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. మరి దిల్ రాజుకు ఎందుకు అర్థం కావడం లేదు? అనిశ్చితి మధ్య సినిమా తీసుకు రావడానికి భయమేస్తే, పరిస్థితి చక్కబడేవరకూ మౌనంగా ఉండాలి. లేదంటే బీవీఎస్ఎన్ ప్రసాద్ తెగించి అత్తారింటికి దారేదిని బయటకు తెచ్చినట్టు తెచ్చేయాలి. ఆ రెండూ చేయడం లేదు రాజు గారు. బయటకు తెస్తే రిస్క్ అని భయపడుతున్నాడు. పోనీ సైలెంట్ గా ఉంటున్నాడా అంటే అదీ లేదు. రిలీజు డేటులు ప్రకటించి ఫ్యాన్స్ ని ఆశపెడ్తున్నాడు. తర్వాత తూచ్ అని డిజప్పాయింట్ చేస్తున్నాడు. ఏంది రాజూభాయ్ ఈ గొడవ? ఫ్యాన్స తో ఏంటీ ఆటలు? ఇలా చేస్తే నీ సినిమా పట్ల వాళ్లకు ఆసక్తి చచ్చిపోదూ!

మరింత సమాచారం తెలుసుకోండి: