ఆయుష్మాన్‌ ఖురానా చండీగఢ్‌ విశాలమైన వీధుల్లో నటుడు కావాలనే కలలతో తిరిగాడు. తండ్రి జ్యోతిష్యుడు. తల్లి గృహిణి. ఇంట్లో నానమ్మ ఆయుష్మాన్‌ ఖురానాను నవ్వించడానికి దేవ్‌ ఆనంద్, రాజ్‌ కపూర్‌లను ఇమిటేట్‌ చేసి నవ్వించేది. ఆయుష్మాన్‌ ఖురానాను తెలుసుకోవాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్‌లోనో, అమేజాన్‌లోనో అతడి సినిమాలు చూడాలి. ‘విక్కీడోనర్‌’, ‘నౌటంకి సాలా’, ‘హవాయిజాదా’, ‘దమ్‌ లగాకే హైసా’, ‘బరేలీకి బర్ఫీ’, ‘శుభ్‌ మంగల్‌ సావధాన్‌’, ‘అంధా ధున్‌’, ‘బధాయి హో’... ఇవన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేని కథలు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఏ హీరో చేయని కథలు. ఆయుష్మాన్‌ ఖురానా ఈ సినిమాలు చేసి నిరూపించుకున్నాడు. నిలబడ్డాడు. కాని ఆ జర్నీ ఏమీ సులువు కాదు.

 

నాలుగేళ్ల వయసులో మొదటిసారి సినిమా హాలులో చూసిన ‘తేజాబ్‌’ సినిమా గుర్తుండిపోయి అలా స్క్రీన్‌ మీద కనిపించాలనే బాల్య కుతూహలం రేపింది. కాలేజీ రోజుల్లో నాటకాల ట్రూపులు తయారు చేసి దేశమంతా స్ట్రీట్‌ ప్లే, స్టేజ్‌ ప్లే చేస్తుండేవాడు. ట్రయిన్లలో ప్రయాణం చేసేటప్పుడు కంపార్ట్‌మెంట్‌లలో తిరిగి పాడుతూ డబ్బులు కలెక్ట్‌ చేసి నాటకాలకు ఉపయోగించేవాడు. అనుభవం ఉంది. ఇక అవకాశం రావడమే మిగిలింది.

 

షారూక్‌ ఖాన్‌ ఫ్యాన్‌ కావడం వల్ల షారుక్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాడని తెలిసి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయడానికి తిరిగి చండీగఢ్‌ వెళ్లిపోయాడు. రెండేళ్ల పాటు చదివి తిరిగి ముంబై వచ్చాక అక్కడ రేడియో జాకీగా టీవీ వ్యాఖ్యాతగా పని చేశాడు.మన దేశంలో తొలిసారి విమానం ఎగరేయడానికి ప్రయత్నించిన బాపూజీ తల్పడే బయోపిక్‌ ‘హవాయిజాదే’లో నటించినా అది హిట్‌ కాలేదు. అయితే వారణాసి నేపథ్యంలో వచ్చిన ‘దమ్‌ లగాకే హైస్సా’ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. టేప్‌ రికార్డర్‌లో పాటలు ఎక్కించే కుర్రాడి పాత్రలో ఆయుష్మాన్‌ నటించాడు. అందులో ఇష్టం లేని భార్యను క్రమంగా ప్రేమించే భర్తగా అందరికీ నచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘అంధా ధున్‌’ చాలా పెద్ద హిట్‌థ్రిల్లర్‌గా నిలిచింది.

 

విజయం అనేది ఒకరు వేసిన భిక్షగా పొందినవారి తీరు వేరుగా ఉంటుంది. విజయాన్ని ఊహించి, నిర్మించి, సొంతం చేసుకున్నవారి తీరు వేరుగా ఉంటుంది. ఆయుష్మాన్‌ ఖురానా విజయం అతడు కష్టపడి సంపాదించుకున్నది. పరాజయం విసిరిన ప్రతి రాయిని వరుసగా పేర్చి ఇవాళ బాలీవుడ్‌ కాలనీలో తన సౌధాన్ని నిర్మించుకున్నాడు.చిన్న కుటుంబం నుంచి వచ్చిన చిన్న కుర్రాడు అనేక ప్రతికూలతలను దాటి హీరో కావచ్చనడానికి ఇటీవలి ఉదాహరణ ఆయుష్మాన్‌. ప్రయోగాలు చేసే నటుడిగా కమల్‌హాసన్‌ను చెప్పుకుంటే ఇతణ్ణి బాలీవుడ్‌ కమలహాసన్‌ అనవచ్చు.         


మరింత సమాచారం తెలుసుకోండి: