పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగడంతో పర్యావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి ఆ దిశగా తొలి అడుగేద్దామని ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి కూడా ఆలోచించాలని ప్రజలను కోరారు. 
అయితే, ప్లాస్టిక్ వాడకం.. దాని రీసైక్లింగ్ గురించి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీకి సలహా ఇచ్చారు. 

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల నిజంగా సమస్య ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలోనే ఆదివారం పూరి సోషల్ మీడియా ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. ఇప్పుడిది ఒక హాట్ టాపిక్ అవుతుంది. వాస్తవంగా చూస్తే వాతావరణంలో మార్పు అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య. ఈ విషయం కాస్త జ్ఞానం కలిగిన ఎవరికైనా తెలుస్తుంది. అంతేకాదు వాతావరణ మార్పుకు కారణాలు లెక్కకు మించి ఉన్నాయి. వాటిలో ప్లాస్టిక్ ఒకటి. కానీ అదే అసలు కారణం కాదు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం వల్ల వాతావరణ మార్పును అడ్డుకోవడం అసాధ్యం.

1960ల్లో ప్లాస్టిక్ కనిపెట్టి, ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇది మనిషి అద్భుత సృష్టి అని ప్రజలు అభిప్రాయపడ్డారు. కారణం అప్పటి వరకు పేపర్ బ్యాగులనే ఎక్కువగా వాడేవారు. ప్లాస్టిక్ బ్యాగులను చాలా సులభంగా తయారుచేయడమే కాదు.. అవి ఎక్కువకాలం మన్నుతాయి, దృఢంగా ఉంటాయి. ప్లాస్టిక్‌ను వాడటం మొదలుపెట్టడం వల్ల నిజానికి మనం చాలా చెట్లను, అడవిని కాపాడుకున్నాం. దాని వల్ల పర్యావరణాన్ని కాపాడటంతో పాటు జీవావరణాన్నిసమతుల్యం చేయగలుగుతున్నాం. ముందుగా మనం వీలైనన్ని ఎక్కువ మొక్కలను నాటడం.. అడవుల పెంపకాన్ని ప్రభుత్వ పాలసీ చేయడం ఎంతో అవసరం. . మన జనాభాను నియంత్రించాలి. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనార్థాల గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి.

అంతేకాదు మనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలి. దీని వల్ల పెట్రోలు, డీజిల్ వాహనాల నుంచి వచ్చే విషవాయులను తగ్గించొచ్చు. మాంసం ఉత్పత్తిని మనం తగ్గించగలిగితే పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను మనం తగ్గించొచ్చు. కూరగాయలు, పండ్లనే మనం ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నా.. మనం పర్యావరణాన్ని కాపాడినట్టే...అంటు ఇలాంటి చాలా సలహాలు సూచనలు పూరి మోదీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి పూరి లేఖ మీద ప్రధాని ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: