మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ సినీ, టీవీ రంగాలు రూపొందించిన నాలుగు సాంస్కృతిక వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. తో సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. దీనిపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన దేశ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఇటివల చేసిన ట్వీట్ ఎంత సంచలనమైందో తెలిసిన విషయమే. ఈ అంశంపై తమిళనాడులో కూడా వ్యతిరేకత వచ్చింది.

 


ప్రముఖ తమిళ నటి ఖుష్బూ కూడా మోదీ తీరుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘భారతీయ సినిమా అంటే హిందీ ఒకటే కాదని ప్రధాని కార్యాలయం గుర్తించాలి. వినోదరంగం నుంచి ఆర్ధిక వ్యవస్థకు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదని దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఆదాయం వస్తోంది. ఎంతోమంది సూపర్ స్టార్స్, టెక్నీషియన్స్ దక్షిణ చిత్రపరిశ్రమల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమానికి దక్షిణ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులను ఎందుకు పిలవలేదో చెప్పాలి. ఇది దక్షిణాది చిత్ర పరిశ్రమపై వివక్ష చూపడమే’ నని తన ట్విట్టర్ అకౌంట్ లో పీఎమ్ఓ నుద్దేశించి పోస్ట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో మోదీ సమావేశమయ్యారు. వారితో దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దక్షిణాది నటులెవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

 

 

ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది పెత్తనం నడుస్తోందనీ, దక్షిణాది రాష్ట్రాలను తక్కువ చేసి చూస్తున్నారనీ రాజకీయంగా అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వినోదరంగానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో సినీ పరిశ్రమ నుంచి కూడా ఆరోపణలు మొదలయ్యాయి. ఉపాసన ట్వీట్ కు సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది. ఖుష్బూ కూడా దీనిపై స్పందించడంతో ఉపాసన ఆవేదనకు బలం చేకూరినట్టైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: