ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు ‘సాహో’ ఊహించిన స్థాయిలో ఘన విజయంసాధించి ఉంటే ఈరోజు ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని అరికట్టడం ఎవరి వల్లా అయి ఉండేదికాదు. ఎప్పటి లాగే ప్రభాస్ నుండి ఎటువంటి సంచలన నిర్ణయాలకు సంబంధించిన న్యూస్ లు లేకపోయినా కూల్ గా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు జరుపు కుంటున్నారు. 

ఇలాంటి సందర్భంలో ఈమధ్యనే లండన్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ‘బాహుబలి’ ప్రదర్శనలో తెలుగువారికి అన్యాయం జరిగింది అంటూ కొందరు చేస్తున్న విమర్శలు ప్రభాస్ పుట్టినరోజునాడు హైలెట్ కావడం అత్యంత ఆశ్చర్య కరం. లండన్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ‘బాహుబలి 1’ కు ఆసినిమాకు సంబంధించిన లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి లండన్ లో ఉండే కొంతమంది తెలుగువారు కూడ ప్రభాస్ రాజమౌళి లపై ఉన్న అభిమానంతో హాజరు అయినట్లు టాక్. 

అయితే వారంతా లండన్ ఆల్బర్ట్ మ్యూజిక్ హాల్ లో ‘బాహుబలి 1’ తెలుగు వెర్షన్ ప్రదర్శన జరుగుతుంది అని భావిస్తే వారికి షాక్ ఇచ్చే విధంగా ఆరోజు ‘బాహుబలి 1’ హిందీ వెర్షన్ ప్రదర్శింప బడటం ఆ కార్యక్రమానికి వచ్చిన తెలుగువారికి ఏమాత్రం నచ్చలేదు అని తెలుస్తోంది. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది అని తెలుగు వారు గర్వహిస్తూ ఉంటే ఇలా ఒక అంతర్జాతీయ వేదిక పై ‘బాహుబలి’ తెలుగు వెర్షన్ కాకుండా హిందీ వెర్షన్ ను రాజమౌళి ఎందుకు లండన్ ప్రజలకు చూపించాడు అంటూ చాలామంది లండన్ లోని తెలుగు ప్రజలు బాధ పడినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈఈవెంట్ కు రాజమౌళి తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టుకుని కండువా వేసుకుని వచ్చి తెలుగు సంస్కృతికి లండన్ లో బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే ఇంత హడావిడి చేసిన రాజమౌళి తెలుగు ‘బాహుబలి’ ని కాకుండా హిందీ ‘బాహుబలి’ ని లండన్ ఆల్బర్ట్ హాలులో చూపించడంతో ఆకార్యక్రమానికి వచ్చిన వారు అంతా ‘బాహుబలి’ మూవీ హిందీలో తీసిన సినిమా అని భావించారు అని తెలుస్తోంది. దీనితో ‘బాహుబలి’ లండన్ ఈవెంట్ లో తెలుగుదనం ఒక్క రాజమౌళి పంచె కట్టులో తప్ప అసలైన ఈవెంట్ లో మిస్ అయింది అంటూ కొందరు విమర్శలు చేయడమే కాకుండా ప్రభాస్ రాజమౌళి లకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ పైనే ప్రేమ ఎక్కువ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: