చెన్నై కృష్ణగిరిలో తమిళ నటుడు విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బిగిల్ సినిమా ఫ్యాన్స్ షో ప్రదర్శించకపోవటంతో విజయ్ అభిమానులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. సినిమా హాళ్ల దగ్గర ఉన్న వాహనాలను ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టి అభిమానులు రచ్చ రచ్చ చేశారు. బిగిల్ సినిమా ఆరోపణలు, కోర్టు కేసులను అధిగమించి ఈరోజు విడుదలైంది. ప్రత్యేక షోల ప్రదర్శనకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 
 
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో సినిమా థియేటర్ల యజమానులు ఫ్యాన్స్ షోలను ప్రదర్శించలేదు. ఫ్యాన్స్ షోలు ప్రదర్శించకపోవటంతో విజయ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. కొందరు అభిమానులు రోడ్లపైకి చేరి వీరంగం సృష్టించారు. రాళ్లు, కర్రలతో తిరుగుతూ విజయ్ అభిమానులు ఆందోళన చేశారు. బారికేడ్లను ధ్వంసం చేసిన విజయ్ అభిమానులు ఆ తరువాత వాహనాలకు నిప్పు పెట్టారు. 
 
పోలీసులు మాత్రం విజయ్ అభిమానులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా విజిల్ పేరుతో విడుదలయింది. రాజారాణి, తెరి, మెర్సల్ సినిమాలకు దర్శకత్వం వహించిన అట్లీ బిగిల్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా విజయ్ కు జోడీగా నయనతార ఈ సినిమాలో నటించింది. 
 
దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఒక ఛాంపియన్ ఫుట్ బాలర్ జీవితం తన స్నేహితుని మరణంతో ఎలా మలుపు తీసుకుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రలో విజయ్ తండ్రి రాయప్పన్ గా కనిపిస్తూ ఉండగా మరో పాత్రలో కొడుకు మేఖేల్ గా కనిపిస్తాడు.  తెలుగులో మహేశ్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. కల్పతి సుబ్రమణ్యన్ ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: