డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "ఇస్మార్ట్ శంకర్". ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్ర విజయంతో పూరి జగన్నాథ్ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. టెంపర్ తర్వాత పూరికి సరైన హిట్ లేదు. టెంపర్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇక పూరి పనైపోయిందనే వ్యాఖ్యలు వచ్చాయి. కానీ మాస్ సినిమాలు తీయడంలో కింగ్ అయిన పూరి జగన్నాథ్ మళ్ళీ తన పవరేంటో ఇస్మార్ట్ శంకర్ ద్వారా చూపించాడు.


మొదటగా ఈ సినిమాలో రామ్ అద్భుతంగా నటించాడు.  హైదరాబాదీ యాసలో మాట్లాడిన రామ్ తన నటనతో, డైలాగులతో అందర్నీ మెప్పించాడు. ఈ సినిమాకి ముందు రామ్ చేసినవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్లే. ఎక్కువగా చాక్లెట్ బాయ్ తరహా పాత్రలు చేసిన రామ్, ఒక్కసారిగా మాస్ లుక్ లో మెరిసి ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు. అయితే ఈ సినిమా రిలీజ్ రేపటికి వంద రోజులు పూర్తి చేసుకోనుంది. పూరి డైలాగులకీ, రామ్ యాక్షన్ తోడవడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.


ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం. చాలా రోజుల తర్వాత పూరి మణి కాంబినేషన్లో వచ్చిన పాటలు దుమ్ము రేపాయి. ఒకప్పుడు పూరి మణిశర్మలది హిట్ కాంబినేషన్. మళ్ళీ వీళ్ళిద్దరిలో కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పాటలు బాగా పాపులార్ అయ్యాయి. మొన్నే విడుదలైన వీడియో సాంగ్స్ కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.


ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ ఫైవ్ సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ భారీ మూల్యానికి అమ్ముడుపోయాయని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి నిర్మాతగా పూరి వ్యవహరించగా, సహ నిర్మాతగా ఛార్మి వ్యవహరించింది. రామ్ సరసర నభా నటేష్ , నిధి అగర్వాల్ నటించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: