డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'తోలుబొమ్మలాట'. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది.  ఈ చిత్రం కోసం సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన 'మనసారా మనసారా' పాటు లిరికల్‌ వీడియోను ఇటీవల  విడుదల చేశారు.


ఈ సందర్భంగా సిద్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ''సురేష్‌ బొబ్బిలి స్వరకల్పనలో చైతన్యప్రసాద్‌ రాసిన 'మనసారా మనసారా' అనే మంచి పాటతో మళ్లీ మీ ముందుకు వచ్చినందుకు  చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన మెలోడీ, అందమైన సాహిత్యం ఉన్న ఈ పాట నాకు ఉద్వేగంతో కూడిన అనుభూతినిస్తుంది. మీరూ వినండి. మీకూ అదే అనుభవాన్నిస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.


దర్శకుడు విశ్వనాథ్‌ మాగంటి మాట్లాడుతూ ''ఈ చిత్రంతో మొత్తం 5 పాటలున్నాయి. అందరూ ఫేమస్‌ సింగర్స్ పాడారు. సిద్‌ శ్రీరామ్‌, విజయ్‌ ఏసుదాస్‌, చిన్మయి, అనురాగ్‌ కులకర్ణి, యాజిన్‌ నజీర్‌, సమీరా భరద్వాజ్‌, హేమచంద్ర ఈ పాటలు ఆలపించారు. ఈ పాటలన్నీ చైతన్య ప్రసాద్‌ రాశారు. 'నీదీ నాదీ ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి మంచి సినిమాలకు స్వరాలందించిన సురేష్‌ బొబ్బిలి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'మనసారా మనసారా' పాట సినిమాలో చాలా కీలకమైనది. ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. విశ్వంత్‌, హర్షిత పై ఈ పాట చిత్రీకరించాం. విశ్వంత్‌, హర్షితకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుంది'' అని తెలిపారు.


నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ ''ఒక కుటుంబంలోని మూడు జనరేషన్ల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వీటన్నిటి కలబోత ఈ చిత్రం. ఒక చిన్న కుర్రాడు ఇంత ఇంటెన్సిటీ, డెప్త్ ఉన్న ఫ్యామిలీ ఎమోషనల్‌ స్టోరీని ఎలా డీల్‌ చేశాడా అని రేపు సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్‌ ఫీలవుతారు. నవంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: