మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు లైఫ్ స్పాన్ ఇచ్చిన సినిమా ఖైదీ. ఈ సినిమాతో చిరంజీవి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు. అప్పటివరకూ ఓ మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది ఖైదీ. ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఫైట్స్, డ్యాన్స్ యువతను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ అప్పట్లో ఓ సంచలనం. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి 36 ఏళ్లు పూర్తయ్యాయి.

 


1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. అప్పటికే 50కి పైగా సినిమాలు చేసిన చిరంజీవికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ఎన్నో హిట్స్ కూడా ఉన్నాయి. కానీ సూపర్ స్టార్ హోదా మాత్రం ఖైదీ తోనే వచ్చింది. హాలీవుడ్ లో వచ్చిన సిల్వర్ స్టర్ స్టాలొన్ సినిమా ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహాలో ఫైట్స్ చేశారు. ఈ సినిమాలో చేసిన ఒరిజినల్ ఫైట్స్, పోలీస్ స్టేషన్ ఫైట్ లో స్పీడ్ కు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ఈ సినిమాతో చిరంజీవి రేంజ్ మారిపోయింది. మాస్ ప్రేక్షకులకు ఆరాధ్య నటుడిగా, సినీ ప్రేక్షకులకు అభిమాన నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయిపోయారు. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద.., ఇదేమిటబ్బా.. అనే పాటలు అప్పట్లో సూపర్ హిట్.



సినిమాకు కథ, మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాతో స్టార్ రైటర్స్ అయిపోయారు. రివేంజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాను తిరుపతిరెడ్డి, ధనుంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ నుంచి మొదలైన చిరంజీవి స్టార్ డమ్ అటుపై తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో దశాబ్దాలపాటు ఏలేలా చేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: