రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతో సంచలనం సృష్ఠిస్తుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. వర్మ ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే ఆ సినిమా ఖచ్చితంగా ఎదో ఒక వివాదంతోనే మొదలుకాకపోతే ఆయనకి సినిమా చేసినట్టుండదు. అంతేకాదు ఈ వివాదమే వర్మ సినిమాలకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. అందుకే వర్మ సినిమాలకి పెద్దగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మద్యే వర్మ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి ముందు ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో అందరికి తెలిసిందే. కానీ సినిమాపై ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ సినిమా విడుదలై మంచి సక్సస్ ను అందుకుంది. 

ఇక వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'. దీనికి సంబంధించి తాజాగా దీపావళి కానుకగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఈ సినిమా పై ఒక వివాదం మొదలైంది. సినిమా టైటిల్ - కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి - రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ ని నిషేధించాలని - సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన తను చేసిన ఫిర్యాదులో కోరడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా టైటిల్ పెట్టారని - అతనిపై కులాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి - ముఖ్యమంత్రి - ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా - రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని - కులాల పేరిట కాదని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరింది. మరి ఈ వివాదం పై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే మన వర్మ కుదురుగా ఉండే రకం కాదు కదా.  



మరింత సమాచారం తెలుసుకోండి: