స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను చేస్తున్న సినిమా కి సంబంధించి ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా పకడ్భందీగా షూట్ చేస్తాడు. కానీ ప్రస్తుతం శంకర్‌కి కూడా లీక్ బెడద తప్పలేదు. అనేక అవాంతరాల అనంతరం తిరిగి సెట్స్‌పైకి వెళ్లిన ‘భారతీయుడు 2’కు లీకుల బెడద పెద్ద షాక్‌లా మారుతోంది. 


కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకొని మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది.  అయితే తాజాగా ఈ చిత్రీకరణలోని కమల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి.


ఈ బయటకొచ్చిన ఫొటోలను చూస్తుంటే సెట్స్‌లోని మనుషులే ఈ చిత్రాలను లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కమల్‌ సేనాపతి గెటప్‌లో గుర్రంపై కూర్చోని ఎక్కడికో వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని ఠీవీగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. ‘మొదటి పార్ట్ లో 70 ఏళ్ళ సేనాపతిగా కనిపిస్తే ఇప్పుడు 90 ఏళ్ళ సేనాపతి గా కనిపించనున్నాడు అని ఆ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది.

లీకెడ్ ఫోటోనే అలా ఉంటే ఇంకా ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుందో?..ఏది ఏమైనా..లోకనాయకడు, శంకర్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని ఈ లీక్డ్ పిక్ చూస్తేనే అర్థమవుతోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: