మన తెలుగు సినిమా జీవించి ఉన్నంతకాలం మనం మర్చిపోలేని ఎందరో గొప్ప మహానటుల్లో ఒకప్పటి గయ్యాళి అత్త పాత్రధారి సూర్యకాంతమ్మ గారు కూడా ఒకరు అనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లా వెంకట కృష్ణరాయపురానికి చెందిన సూర్యకాంతమ్మ గారికి చిన్న వయసులోనే గానం మరియు నాట్యంలో మంచి ప్రావీణ్యత ఉండేదట. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక పలు నాటకాల్లో నటించిన సూర్యకాంతమ్మ గారు, అనంతరం సినిమాల మీద మక్కువతో చెన్నై చేరుకొని, తొలుత జెమినీ స్టూడియోస్ వారు నిర్మించిన చంద్రలేఖ అనే సినిమాలో నాట్యకారిణి పాత్రలో నటించారు. ఇక ఆ తరువాత తనకు హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ, తాను అటువంటి పాత్రలకు సరిపోనని భావించి వదిలేసుకున్నారట. 

అనంతరం ఒక కారు ప్రమాదంలో ముఖానికి గాయాలవడంతో ఆమె ముఖం కొద్దిగా మారిందట. ఇక ఆ తరువాత క్యారెక్టర్ ఆరిస్టుగా స్థిరపడాలని భవించిన ఆమెకు అప్పటి అగ్ర నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణి గార్లు తమ సంసారం అనే సినిమాలో నెగటివ్ పాత్ర ఇవ్వడం, ఆ పాత్రలో సూర్యకాంతమ్మ గారు ఎంతో సహజ నటన కనపరచడం జరిగిందట. ఇక అక్కడినుండి తాము తీసే ప్రతి సినిమాలో సూర్యకాంతమ్మ గారిని తప్పనిసరిగా తీసుకునేవారట నాగిరెడ్డి, చక్రపాణి గారు. కొన్నాళ్ళకు తాము ఎన్టీఆర్ మరియు ఎఎన్నార్ గార్లతో తెరకెక్కించబోయే గుండమ్మ కథలో ముఖ్య పాత్రధారి అయిన గుండమ్మగా సూర్యకాంతమ్మ గారిని తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా అత్యంత అద్భుత విజయాన్ని దక్కించుకుని గయ్యాళి అత్తగా సూర్యకాంతమ్మ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుడి సూర్యకాంతమ్మ గారికి వెల్లువలా అవకాశాలు దక్కాయి. 

ఇక మొదటి నుండి ఎంతో సౌమ్యురాలు మరియు మృదు స్వభావి అయిన సూర్యకాంతమ్మ గారు, తాను నటిస్తున్న సినిమా షూటింగ్ లోని యూనిట్ సభ్యులందరికీ స్వయంగా తానే ఇంటినుడి ప్రత్యేకంగా భోజనం తాయారు చేసుకువచ్చేవారట. ఇక ఆమెకు ఎన్టీఆర్ గారంటే ఎంతో ప్రాణమని, ఆయనకు ఎంతో ఇష్టమైన రకరకాల వంటకాలు ఆమె తన ఇంటినుండి షూటింగ్ జరిగిన ప్రతిరోజూ తెప్పించి పెట్టేవారని అప్పటి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూ లో చెప్పడం జరిగింది. అలానే ఆమె ఎందరికో తన చేతికి ఎముక లేనట్లుగా దానధర్మలు కూడా చేశారట. ఇక మెల్లగా ఆమెకు వయసు మీద పడడంతో ఒకింత సినిమాలు తగ్గించారని, ఇక మరింత వృద్ధాప్యం వచ్చాక తన ఇంటికి ఎవరు వచ్చినా, దయచేసి తప్పుగా అనుకోకండి, అక్కడ టేబుల్ మీద వంట పదార్ధాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, నేను లేచి రాలేను, కాబట్టి మీరే పెట్టుకుని కడుపునిండా తిని వెళ్ళండి అని చెప్పేవారట. తనకు ఆరోగ్యం ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ఇంటికి వచ్చిన వారికి పట్టెడు అన్నం పెట్టలేని నా పరిస్థితి మరొకరికి రాకూడదని ఆమె ఎంతో ఆవేదన చెందేవారట. ఇక చివర్లో తీవ్ర అనారోగ్యం పాలైన సూర్యకాంతమ్మ గారు 18 డిసెంబర్ 1994న అకాల మరణం పొందారు. కాగా అక్టోబర్ 28 ఆమె జయంతి కావడంతో పలువురు తెలుగు ప్రేక్షకులు ఆమెను స్మరించుకున్నారు...!!   


మరింత సమాచారం తెలుసుకోండి: