‘సీతారామ కళ్యాణం’ సినిమాతో తెలుగు సినిమారంగ ప్రవేశం చేసిన గీతాంజలి కన్ను మూశారు. సీత పాత్రకు అంజలీ దేవి తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక నటి గీతాంజలి. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన ఈమె అందరి సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది. 

తెలుస్తున్న సమాచారం మేర ఈమె గుండెపోటుతో ఫిలింనగర్ దగ్గరలోని ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి మొదట హిందీలో ‘పేయింగ్ గెస్ట్’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. గీతాంజలి సుమారు 100కు పైగా సినిమాలలో నటించింది. ‘శ్రీశ్రీ మర్యాదరామన్న’ ‘సీతారామకళ్యాణం’ ‘డాక్టర్ చక్రవర్తి’ ‘బొబ్బిలి యుద్ధం’ ‘ఇల్లాలు’ ‘తోడ నీడ’ ‘లేత మనసులు’ ‘దేవత’ ‘శ్రీకృష్ణావతారం’ ‘ప్రాణమిత్రులు’ ‘పూలరంగడు’ ‘గూఢాచారి 116’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.  

చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మిలోనూ’ నటించింది. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. ఈమె వారసుడు ‘భూమ’ అనే మూవీ ద్వారా పరిచయం అయినప్పటికీ ఆ తరువాత కాలంలో పెద్దగా రాణించలేదు. ఎప్పుడు చెరగని చిరునవ్వుతో నవ్వుతూ కనిపించే ఈమె వివాదాలకు సంచలన వ్యాఖ్యలకు చాల దూరంగా ఉండేది. స్వర్గీయ ఎన్టీఆర్ ను ‘నాన్నగారు’ అంటూ చాల అభిమానంగా పిలిచే ఈమె అంటే ఎన్టీఆర్ కు విపరీతమైన గౌరవంతో పాటు ఇష్టం కూడ. ఈమెకు మంచినటిగా పేరు వచ్చినప్పటికీ ఆమె కాలంలో ఉండే తోటి నటీమణుల పోటీ వల్ల ఈమె సమర్ధతకు తగ్గ అవకాశాలు రాలేదు అని అంటారు. నందీ అవార్డ్స్ కమిటీలో సభ్యురాలుగా ఈమె అనేకసార్లు పనిచేసింది. ఈమె మరణంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ విషాదంలో ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: