నటరత్న ఎన్టీయార్ ఎవరినీ  మామూలుగా ఏదీ మెచ్చుకోరు. ఆయన మెరిట్స్ డీ మెరిట్స్ అన్నీ బేరీజు వేసుకుని తన సినిమాల్లో పాత్రలకు  ఎంపిక చేస్తారు. ఆయన కంట్లో పడిన వారంతా నటులు కాలేరు. ఎందుకంటే నందమూరి వారు ఓ విశ్వవిద్యాలయం. అక్కడ కనుక పాస్ అయితే ఇక తిరుగులేదు. అలా అన్న గారు మెచ్చిన సీతమ్మగా ఆమె దశాబ్దాలుగా గుర్తింపు పొందింది. ఆమె నిన్న రాత్రి హఠాత్తుగా కన్ను మూసిన గీతాంజలి.


గీతాంజలి తొలి చిత్రం సీతారామ కళ్యాణం. పెద్దాయన నన్ను వెండి తెరకు పరిచయం చేశారని గర్వంగా చెప్పుకునే గీతాంజలి మంచి నటి. ఆమె ఎన్టీయార్ డైరెక్షన్లో నటించడం గొప్ప విషయమే. సీత పాత్ర కోసం ఎందరినో చూసి చూసి విసుగెత్తిన రామారావు  కంట్లో అప్పటికి పదహారేళ్ళ పడుచు పిల్ల గీతాంజలి పడ్డారు. ఆమెలో సీతను చూసిన రామారావు మెచ్చుకున్నారు. ఏకంగా సీతమ్మా అంటూ నుదుటిన తిలకం దిద్దారు.


ఆ ఆశీస్సులతో ఇంతకాలం వెండితెర మీద వెలిగాను అంటూ తరచూ చెప్పుకునే గీతాంజలి ఇక లేరు అన్న వార్త టాలీవుడ్ కి అతి పెద్ద విషాదమే. హీరోయిన్ గా ఆమె తక్కువ సినిమాలు చేసినా హాస్యనటుడు పద్మనాభంతో కలసి జంటగా నవ్వులు పూయించారు. వీరిద్దరిదీ హిట్ పెయిర్ అంటారు. అలాగే అక్కినేనికి చెల్లెలుగా అనేక సినిమాలల్లో నటించి మెప్పించారు. ఇక హీరో క్రిష్ణ, శోభన్ బాబుల  పక్కన హీరోయిన్ గా నటించి పాటలు కూడా పాడారు. తెలుగుతో పాటు, తమిళ్, హిందీ, మళయాళం భాషల్లో నటించిన  గీతాంజలి తన తోటి నటుడు హీరో రామక్రిష్ణను వివాహం చేసుకున్నరు. ఆమెకు ఒక కుమారుడు. అతన్ని హీరోగా చేద్దామనే ఆమె హైదరాబాద్ కు మకాం మార్చారు. ఒక సినిమా కూడా తీశారు. అది ఫెయిల్ అయింది. 


ఇదిలా ఉండగా గీతాంజలి సెకండ్ ఇన్నింగ్స్ లో అనేక చిత్రాల్లో క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.  టాలీవుడ్లో ఏ  ఫంక్షన్  జరిగినా పాత తరం నటిగా తప్పనిసరిగా హాజ‌రవుతూ నాటి తీపి గురుతులను ఈ జనరేషన్ ని చెప్పే గీతాంజలి ఇక లేరు అంటే అది తెలుగు సినిమా ప్రియులకూ విషాదమే.



మరింత సమాచారం తెలుసుకోండి: