వివాదాలకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూనే ఉంటారు. మొన్నటికి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి, దాన్ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయడానికి నానా తంటాలు పడ్డాడు. అయితే ఇప్పుడు మరో అతి వివాదాస్పదమైన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడులు అనే టైటిల్ తో సినిమా తీసాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది.


సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎన్ని విమర్శలు వస్తున్నాయో చూస్తున్నాం. వర్మ కులాలని టార్గెట్ చేసి , ప్రజల్లో కులపిచ్చి పెంచేలా చేస్తున్నాడని, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వర్మ సినిమా ఉందని ఆరోపిస్తున్నారు. మరోవైపు వర్మ, ఈ సినిమా సందేశాత్మక చిత్రం అనీ, తాను తీసిన మొదటి సందేశాత్మక చిత్రం ఇదేనని అంటున్నాడు. సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో పక్కన పెడితే, ఆ సినిమాలోని క్యారెక్టర్లు ప్రస్తుత రాజకీయ నాయకుల రూపు రేఖలకి చాలా దగ్గరగా ఉన్నాయి.


అలా దగ్గరగా ఉన్న వారిలో కే ఏ పాల్ క్యారెక్టర్ కూడా ఉంది. అయితే కే ఏ పాల్ క్యారెక్టరే కాదు ఆయన మీద ఒక పాట కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ప్రజాశాంతి పార్టీ స్థాపకుడైన కే  ఏ పాల్ పై  ప్రత్యేక పాట చాలా గమ్మత్తుగా ఉంది. జేమ్స్ బాండ్ తరహా ఇంట్రడక్షన్ తో ‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అనే పాటను యూట్యూబ్ లో వదిలారు. గతంలో పాల్ అనేక వేదికలపై,పలు సందర్భాలలో చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ఆయన ఈ సాంగ్ రూపొందించారు. 


ఈ పాటని కే ఏ పాల్ పుట్టిన ఊరైన చిట్టివలస గ్రామ ప్రజలకి అంకితమివ్వడం కొసమెరుపు. అయితే ఈ పాట సినిమాలో ఉంటుందా లేదా అన్నది ప్రశ్న. ఎందుకంటే గతంలో వర్మ రిలీజ్ చేసిన ఇలాంటి పాటలన్నీ పబ్లిసిటీకి వాడుకున్నవే తప్ప సినిమాలో పెట్టింది లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: