ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఒక ఊహించని అవమానం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా బాలు బయట పెట్టడంతో ఈ న్యూస్ అందరి దృష్టికి వెళ్ళింది. 

గత నెల మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా సినీ ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రధాని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు. దక్షిణాదికి చెందిన అతికొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి పిలిచారు.ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. 

ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలోకి బాలు ఎంటర్ కాగానే ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్ అక్కడి అధికారులు తీసుకున్నారట. తాను ప్రధాని మోడీ ఆహ్వానిస్తే ప్రత్యేకంగా వచ్చాను అని చెప్పినా అక్కడి అధికారులు పట్టించుకోలేదట. అయితే ఆ కార్యక్రమం పూర్తి అయిన తరువాత చాలామంది బాలీవుడ్ సెలెబ్రెటీలు ప్రధాని మోడీతో తమ సెల్ ఫోన్స్ తో సెల్ఫీలు తీసుకోవడం పసిగట్టిన బాలు వారిదగ్గర సెల్ ఫోన్స్ ఎలా వచ్చాయి అని అడిగితే వారంతా జాతీయ స్థాయి కావడంతో వారిదగ్గర నుండి సెల్ ఫోన్స్ తీసుకోలేదు అన్న సమాధానం వచ్చిందట. 

దీనితో 50 వేలకు పైగా పాటలు పాడటమే కాకుండా అనేక హిందీ సినిమాలకు కూడ పాటలు పాడిన తాను సెలెబ్రెటీని కానా అంటూ బాలసుబ్రహ్మణ్యం తన ఆవేదనను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు బాలు చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో బాలసుబ్రహ్మణ్యంకు అవమానం జరిగింది అంటూ అతడి అభిమానులు ఆవేదనకు గురి అవుతూ దక్షిణాది వారు అంటే ఉత్తరాది ప్రాంతం వారికి చిన్న చూపు అంటూ అసహనానికి లోనవుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: