నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం జతకట్టబోతున్నారు. సింహా-లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడో సారి కలిసి పని చేయబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ కంప్లీటవగానే బోయపాటి సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బోయపాటి సినిమాలో ఎప్పటిలాగే ఉండే అందమైన హీరోయిన్ తో పాటు పవర్ ఫుల్ విలన్ ని సెలెక్ట్ చేసే హడావుడిలో ఉన్నారు. హీరో ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి కథ ఎంత బలంగా ఉంటుందో అందులో పాత్రలు అంతే బలంగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే నటీనటుల్ని సెలెక్ట్ చేసుకుంటారు బోయపాటి.

అందుకనే ఈసారి హ్యాట్రిక్ కోసం హీరోకి ధీటుగా విలన్ పాత్రని అంతే బలంగా రాసుకున్నాడట బోయపాటి. ఈ నేపథ్యంలో బాలయ్య విలన్ విషయంలో ఒక ఆసక్తికరమైన రూమర్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ కోసం బోయపాటి ఈసారి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని టాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం బోయపాటి సీరియస్ గా సంజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. 

బాలయ్య తో సంజయ్ ఎలా ఢీ కొట్టబోతున్నాడన్న ఆతృత నందమూరి ఫ్యాన్స్ లో ఇప్పటికే పెరిగిపోయింది. ప్రస్తుతం సంజయ్ దత్ కేజీఎఫ్-2లో పవర్ ఫుల్ విలన్ అధీరాగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ గెటప్ చూసే బాలయ్య కోసం తీసుకోవాలన్న ఆలోచన బోయపాటికి వచ్చిందట. ఆ మధ్య  వినయ  విధేయ రామ లో చరణ్ ని ఢీ కోట్టడానికి బాలీవుడ్ నుంచి వివేక్ ఓబెరాయ్ ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. మరి సంజయ్ బాలయ్య కోసం టాలీవుడ్ కి వస్తాడా లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: