పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ లో నిజంగా నటిస్తాడా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకపోయినా పవన్ కోసం అతడి వదిన సురేఖ హీరోయిన్ ఎంపిక చేసిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఇది ఇప్పటి విషయం కాదు. పవన్ పవర్ స్టార్ గా మారక ముందు నటించిన ‘గోకులంలో సీత’ సినిమాకు సంబంధించింది. 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత సినిమాల గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మూవీలో తనను పవన్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసిన వ్యక్తి చిరంజీవి భార్య సురేఖ అన్న విషయాన్ని వివరించింది. 

తనకు ఈ సినిమా ప్రారంభానికి ముందు చిరంజీవి పిలుస్తున్నారని ఫోన్ రావడంతో తాను అప్పట్లో చిరంజీవి ఇంటికి వెళ్ళిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే తాను అక్కడకు వెళ్ళే సరికి చిరంజీవి లేరని అయితే తనను ఇంటర్వ్యూ చేసి తన ఫోటోల ఆల్బమ్ ను చూసిన వ్యక్తి సురేఖ అని చెపుతూ ఆమె అప్పట్లో తనకు పవన్ గురించి చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు బయట పెట్టింది. 

పవన్ కు సిగ్గు ఎక్కువని ముఖ్యంగా అమ్మాయిలతో అసలు చనువుగా ఉండడని అందువల్ల సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసే విషయంలో పవన్ మొహమాటపడితే ఆ విషయాలను పట్టించుకోకుండా ఆ రొమాంటిక్ సీన్స్ రక్తి కట్టించేలా శ్రద్ధ తీసుకోమని తనకు ప్రత్యేకంగా చిరంజీవి భార్య తనకు చెప్పడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఒక తల్లిలా పవన్ గురించి ఆరాట పడుతూ అతని మనస్తత్వాన్ని తనకు పూర్తిగా అర్ధం అయ్యేలా సురేఖ తనకు చెప్పడమే కాకుండా ఆ సినిమాతో తనకు పవన్ కు మంచి బ్రేక్ వస్తుంది అన్న విషయాన్ని ఆమె ముందే ఊహించి చెప్పడం తాను జీవితంలో మరిచిపోలేని సంఘటన అని రాశి అలనాటి జ్ఞాపకాలను ఈనాటి ప్రేక్షకులకు షేర్ చేసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: