టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మంచి జోష్ తో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై రోజు రోజుకు ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి అనే చెప్పాలి. నిజానికి ఓవైపు ఇదే రోజున రిలీజ్ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమా టీమ్, సరిలేరు టీమ్ కంటే మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ, సరిలేరు నీకెవ్వరు నుండి ఇటీవల రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్, ఇంట్రో టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయని చెప్పాలి. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. అదేమిటంటే, రెండు వరుస హిట్స్ తో మహేష్ బాబు దూసుకుపోతుంటే, కెరీర్ పరంగా ఇప్పటివరకు తీసిన నాలుగు సినిమాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడం. 

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆయన నుండి ఆశిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు పలు అంశాలు కూడా కలగలిపి మంచి కమర్షియల్ ఎంటెర్టైనెర్ గా అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్ . ఇక ఇటీవల మహేష్ నటించిన రెండు సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ని అందిస్తుండడంతో సాంగ్స్ పై కూడా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే మహేష్ నటించిన మహర్షిలో ఆశించిన రేంజ్ లో దేవి సాంగ్స్ అందివ్వలేదనే విమర్శలు కొన్నాళ్ల క్రితం ఎక్కువగా వినపడ్డాయి. కావున ప్రస్తుతం చేస్తున్న ఈ సరిలేరు సినిమాకు తన టాలెంట్ మొత్తాన్ని వినియోగించి దేవి సూపర్ సాంగ్స్ సిద్ధం చేస్తున్నారట. 

ఇకపోతే ఈ సినిమాకు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న రత్నవేలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో నేడు ఒక పోస్ట్ పెట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ వార్త చెప్పారు. అదేమిటంటే, ఈ సినిమాలో ఇప్పటికే దేవి గారు కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ నేను విన్నాను. నిజంగా ఆ సాంగ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలానే వాటిని నేను నా కారులో రిపీట్ మోడ్ లో పెట్టుకుని వింటున్నాను. రేపు ఫుల్ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అని రత్నవేలు పోస్ట్ చేయడం జరిగింది. ఇక రత్నవేలు పోస్ట్ ని ట్యాగ్ చేసిన నిర్మాత అనిల్ సుంకర, మన సినిమా సాంగ్స్ మీకు ఎంతో నచ్చాయి అనే పదం నా చెవులకు మంచి వినసొంపుగా ఉంది అంటూ రీట్వీట్ చేసారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నిఅంటుతున్నాయి. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: