కమెడీయన్ అలీకి నడుస్తున్న కాలం ఏమంత కలిసి రావడం లేదు. యంగ్ కమెడియన్స్ హవాతో అవకాశాలు పూర్తిగా కోల్పోయిన అలీ రాజకీయాలలో అయినా రాణించి పదవులు పొందాలని గత ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ విజయం కోసం ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలలో ప్రచారం కూడ చేసాడు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటినా ఇంకా అలీకి ఎటువంటి పదవీ యోగం పట్టలేదు. ఒకానొక సమయంలో అలీని ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తారని లీకులు వచ్చాయి. ఆ పదవి కోసం అలీ గత కొంత కాలంగా కన్నులు కాచేలా ఎదురు చూస్తున్నాడు. 

అయితే ఇప్పుడు అలీకి ఒకనాటి సీనియర్ నటుడు విజయ్ చందర్ నుండి ఊహించని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ చందర్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గా ఎంపిక చేయడం ఖాయం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. అలీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన నుండి విజయ్ చందర్ ఆ పార్టీ కోసం ఎంతో ప్రచారం చేసాడు. 

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడుగా ప్రఖ్యాత గాయని టంగుటూరి సూర్య కుమారి మేనల్లుడుగా మాత్రమే కాకుండా ‘కరుణామయుడు’ సినిమాతో ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు విజయ్ చందర్. ఆ తరువాత అతడి ప్రాభవం పూర్తిగా తగ్గిపోయినా విజయ్ చందర్ రాజకీయాలలో కొనసాగుతూ వైఎస్ఆర్ పార్టీకి తనవంతు సేవలను అందిస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితులలో విజయ్ చందర్ కు ఇలాంటి కీలక పదవి రాబోతోంది అని వార్తలు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారితే అలీకి ఊహించని షాక్ ఇచ్చింది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: