ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసే కొందరు దర్శకులకు బాలీవుడ్ లో కూడా తమను తాము నిరూపించుకోవాలని చూస్తారు. బాలీవుడ్ మార్కెట్ అలాంటిది. అలా వెళ్లిన వాళ్లలో దక్షిణాది నుంచి తెలుగు, తమిళ్, మళయాళం నుంచి కొందరు తమ ఇంపాక్ట్ చూపగలిగారు. తొంభైల దశకంలోనే బాలీవుడ్ గుమ్మం తొక్కి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులు కొందరున్నారు.

 

 

తెలుగు నుంచి బాలీవుడ్ లో జెండా ఘనంగా ఎగురేసింది మాత్రం నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మనే. బాలీవుడ్ లో ఆర్జీవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎవరూ టచ్ చేయటానికి కూడా భయపడే మాఫియాను తన దర్శకత్వంతో ఆడుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో ఆర్జీవీ పేరు మోగిపోయింది. అంతకు ముందు రాఘవేంద్రరావు హిందీలో సినిమాలు తీసి, శ్రీదేవిని హిందీకి పరిచయం చేసి తన మార్క్ చూపించాడు. రవిరాజా పినిశెట్టి చిరంజీవి సినిమాలతో బాలీవుడ్ కి వెళ్లాడు. ఈవీవీ సత్యనారాయణ సూర్యవంశం సినిమాను అమితాబ్ తో తీసాడు. విశేషమేంటంటే హిందీ రాకుండా హిందీలో సినిమా తీసిన ఘనత సాధించాడు ఈవీవీ. తర్వాత కృష్ణవంశీ బాలీవుడ్ లో సినిమా తీసినా పెద్దగా రాణించలేదు. ఇటీవల క్రిష్ రెండు సినిమాలు చేసి వార్తల్లో నిలిచాడు.. వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు.

 

 

మణిరత్నం బాలీవుడ్ లో చూపించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. రోజా, బొంబాయి సినిమాలు ఓ సంచలనం. శంకర్ కూడా బాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు కానీ మణిరత్నంలా హిట్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు. మళయాళం నుంచి ప్రియదర్శన్ బాలీవుడ్ లో బాగానే క్లిక్ అయ్యాడు. ఇలా బాలీవుడ్ లో నిరూపించుకున్న వాళ్లు, నిరూపించుకోవాలి అనుకునేవాళ్లకు కొదవ లేదు. హిందీ సినిమాలకు దర్శకత్వం వహించటమంటే ప్రమోషన్ వచ్చినట్టే మరి. వీరి స్ఫూర్తితో మరెంతమంది దర్శకులు హిందీకి వెళ్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: