తమిళ తంబి కార్తీ ప్రస్తుతం ఖైదీ సినిమా విజయం సాధించిన ఆనందంలో ఉన్నాడు. ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన కథ, కథనంతో పాటు మరొక అంశం కూడా ఉంది. అదే సినిమా టైటిల్ ‘ఖైదీ’. ఈ సినిమా టైటిల్ కి ఓ చరిత్రే ఉంది. చిరంజీవిని సూపర్ స్టార్ ని చేసిన టైటిల్ ఇది. అలాంటి టైటిల్ ని తెలుగు వాళ్లు కాకుండా తమిళ వాళ్లు తీసుకోవడం ఒకింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. చిరంజీవి టైటిల్ తో రచ్చ చేసిన కార్తీ ఇప్పుడు పవన్ కల్యాణ్ టైటిల్ ను టార్గెట్ చేశాడని అంటున్నారు.

 


కార్తీ తన తర్వాత సినిమాను జీతు జోసెఫ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తెలుగు దృశ్యం ఒరిజినల్ సినిమా దర్శకుడీయన. ఈ సినిమాలో జ్యోతిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలో ఈ సినిమా టైటిల్ ను తన్నీ గా అనుకుంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘తమ్ముడు’ టైటిల్ ను పెట్టాలని ఆలోచనలో ఉన్నాడట కార్తీ. మెగాస్టార్ టైటిల్ బాగా కలసి రావడంతో ఇప్పుడు ‘తమ్ముడు’పై పడ్డాడని అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఇకపై తమ సినిమాలకు మెగా టైటిల్స్ అన్నీ తమిళ తంబీలే వాడేసుకుంటారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.

 


విజయ్ నటించిన విజిల్ తో పోటీ పడి అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ పెద్ద హిట్ సాధించాడు కార్తీ. తెలుగులో కార్తీ మార్కెట్ ను మించిన కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది ఖైదీ. తెలుగులో విజయ్ కంటే తానే టాప్ అని నిరూపించుకున్నాడు. దీంతో తర్వాతి కార్తీ సినిమాపై అంచనాలు పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: