బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒక సినిమాలో నటిస్తున్నారంటే ప్రపంచం మొత్తం తనవైపే చూస్తుంది.  అయితే ఏడాది కాలంగా అమీర్ నటించిన సినిమా ఏదీ రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఎంత నిరాశలో ఉన్నారో చెప్పలేము. 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' గత ఏడాది నవంబర్ లో రిలీజైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ భారీ సినిమా ఘోరమైన ఫెయిల్యూర్ అయింది. తర్వాత అమీర్ తన సినిమాల ఎంపిక విషయంలో ఎంతో ఆచితూచి అడుగులేశాడు. ఆ కోవలోనే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్' రీమేక్ లో నటించేందుకు చాలానే హార్డ్ వర్క్ చేశాడు. ప్రీప్రొడక్షన్ కోసమే ఏడెనిమిది నెలల సమయం తీసుకుని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 

తాజాగా అమీర్ నటిస్తున్న సినిమాకి సంబంధించి లుక్ ఒకటి లీకైంది. ఈ లీక్డ్ ఫోటోలో అమీర్ గుర్తు పట్టలేనంత కొత్తగా కనిపిస్తున్నాడు. పూర్తిగా గుబురుగడ్డం తలపాగాతో సిక్కు గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ గెటప్ చూస్తుంటే వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రతిసారీ అమీర్ నుంచి ఏదో ఒక కొత్తదనం ఆశించే అభిమానులకు ఇది నిజంగానే సర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పాలి. ఈ సినిమాలో సర్ధార్ అనే పాత్రలో నటిస్తున్నారు. 'లాల్ సింగ్ ఛద్ధా' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సిక్కులు ఎక్కువగా ఉండే ఛండీఘర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది

ఇక అమీర్ న్యూలుక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు గుర్తు పట్టలేకపోతున్నాం! అంటూ చాలా మంది అభిమానులు సర్ ప్రైజ్ అవుతుంటే.. సర్ధార్ జీ లుక్ లో ఎంతో అందంగా ఉన్నారంటూ అమీర్ ని పొగిడేస్తున్నారు కొందరు. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2020 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని బాలీవుడ్ మీడియా సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: