మనకు మనమే గొప్పలు చెప్పుకునే తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఎల్లలు దాటింది. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా గొప్పదనాన్ని దేశానికి పరిచయం చేస్తే.. తెలుగు సినిమా కలెక్షన్ల స్థాయిని దేశానికి చాటి చెప్పింది మెగాస్టార్ చిరంజీవి. ఈ రెండింటినీ మిక్స్ చేసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి ఘనంగా చాటింది రాజమౌళి. పాన్ ఇండియా మూవీగా చరిత్ర సృష్టించిన బాహుబలి స్ఫూర్తితో తెలుగులో ఎక్కువగా అలాంటి కథల కోసమే స్టార్ హీరోలు వెదుకుతున్నారు.

 

 

స్టార్ హీరోలతో పాటు మార్కెట్ ఉన్న ప్రతి హీరో ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ ల కోసం రచయిత, దర్శకులను అడుగుతున్నారట. ప్రభాస్ సాహో, చిరంజీవి సైరా.. ఇదే తరహా సబ్జెక్టులతో భారీగా తెరకెక్కాయి. సాహో తెలుగులో ఫ్లాప్ అయి బాలీవుడ్ కలెక్షన్లు తెచ్చుకుంది. సైరా బాలీవుడ్ లో ఫ్లాప్ అయి తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కోసం రచయితలను అడుగుతున్నాడని టాక్. ప్రశాంత్ నీల్ తో మహేశ్ చేయబోయే తర్వాతి సినిమా పాన్ ఇండియా సబ్జెక్టే అంటున్నారు. ఇప్పటికైతే ఆ స్థాయి కథ, కథనం, క్యాస్టింగ్ తో వస్తున్న తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్.

 

 

రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్.. లాంటి భారీ క్యాస్టింగ్ కు తోడు రాజమౌళి బ్రాండ్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలువబోతోంది. టాలీవుడ్ ఆధిపత్యాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకే సాహో, సైరాలకు వీక్ ప్రమోషన్స్ చేసిందని టాక్ కూడా ఉంది. కాబట్టి కథ ఉంటే సరిపోదు.. మంచి మార్కెటింగ్ ప్రమోషన్స్ కూడా ముఖ్యమని ఈ సినిమాలు నిరూపించాయి. మరి.. రాబోయే రోజుల్లో ఈ పాన్ ఇండియా సబ్జెక్ట్ ల పోకడ తగ్గుతుందో.. పెరుగుతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: