మాయా బజార్, గుండమ్మ కథ, పాండవ వనవాసం, శీ కృష్ణ పాండవీయం, దాన వీర శూర కర్ణ..వంటి సినిమాల నుండి పదహారేళ్ళ వయసు, ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, సాగర సంగమం,  శ్రుతి లయలు, సిరి వెన్నెల, శంకరా భరణం, స్వయం కృషి, శుభ సంకల్పం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో అద్భుతమైన.. నవరసాలతో కూడుకున్న గొప్ప సినిమాలు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని పతాక స్థాయిలో నిలబెట్టాయి. మన భాష మీద.. మన సినిమాల మీద మిగతా సినీ ఇండస్ట్రీలలో ఎనలేని గౌరవాన్ని చూపించే దర్శక, నిర్మాతలు, నటీనటులు, ప్రేక్షకులు కొన్ని కోట్లలో ఉన్నారంటే ఏమాత్రం అతిశయోకి కాదు. ఇక దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా గొప్పదనం ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారు. 

ఈ రోజు ఒక భారీ బడ్జెట్ సినిమా మన తెలుగు భాష నుండి వస్తుందంటే అన్నీ చిత్ర పరిశ్రమలే కాదు..యావత్ ప్రపంచం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 70-80 ఏళ్ళుగా ఇంతగా కృషి చేసి మన తెలుగు చిత్ర పరిశ్రమకి నాటి బి.ఎన్.రెడ్డి, హెచ్ ఎం రెడ్డి, సి.పుల్లాయ్య, ఎల్.వి.ప్రసాద్, కె.వి.రెడ్డి, కె.విశ్వ నాథ్, బాపు-రమణ, కె.బాల చందర్, దాసరి నారయణ రావు, కోడి రామ కృష్ణ, కె.రాఘవేంద్ర రావు, ఎస్.ఎస్.రాజమౌళి వంటి ఎందరో దర్శక, నిర్మాతలు కొన్ని సంవత్సరాల తరబడి కష్ఠపడి తెచ్చిన గౌరవాన్ని ఇప్పుడొస్తున్న కొందరు దర్శక, నిర్మాతలు సర్వ నాశనం చేసేస్తున్నారు. అసలు ఎవరికోసం ఇటువంటి పనికిమాలిన సినిమాలు తీస్తున్నారో తెలీయడం లేదు. కళామ తల్లిని కించ పరిచే సినిమాలు తీసే హక్కు వీళ్ళకెవరిచ్చారో అర్థం కావడం లేదు. ఏడు చేపల కథ, దండు పాళ్యం, RDXలవ్.. డిగ్రీ కాలేజ్..రాణి..ఇలా చాలానే అడ్డమైన సినిమాలున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే కేవలం యూత్ మాత్రమే థియోటర్స్ కి వస్తే చాలనుకునే దర్శక, నిర్మాతలే ఉన్నారు. పైగా మేము మంచి సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదంటు వేధవ సోది చెబుతున్నారు. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, మహానటి..మజిలీ, జెర్సీ, నిన్ను కోరీ, ఓ బేబి..వంటివి సినిమాలు కాదా..ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ కాదా..!

ట్రైలర్స్ టీజర్స్ చూస్తే ఎంత సేపటికి మూతులు నాక్కోవడం, బట్టలు విప్పి ఒకరిమీద ఒకరు పడుకోవడం..నాలుగు పచ్చి బూతులు ...ఇంతకంటే ఏమీ ఉండటం లేదు. జనాలకి ఏం కావాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. డబ్బు సంపాదించడానికి ఇలాంటి నీచమైన సినిమాలు తీసుకునే బదులు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. సినిమా ఇండస్ట్రీకొచ్చి ఎవరిని ఉద్దరించడానికి ఇలాంటి అడ్డమైన సినిమాలు తీయాలి..తీసి తెలుగు సినిమా మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టాలి. ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్న మన ఇండస్ట్రీలో పెద్దలు ఎందుకు చూస్తూ ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఒక గొప్ప సినిమా.. నీట్ గా ఉన్న సినిమా అంటే కనీసం ఒక లిప్ లాక్ కూడా లేని సినిమా సంవత్సరం లో ఒక్కటైనా వస్తుందా..మళ్ళీ బాపు-రమణ, కె.విశ్వనాథ్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి వస్తారా..వచ్చే అవకాశాలున్నాయా.. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా లేదనే తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: