తెలుగు సినిమా రంగంలో చిరంజీవి వేసిన ముద్ర ఓ చరిత్రే అవుతుంది. సినిమాల మీద అభిరుచితో అడుగుపెట్టి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మెగాస్టార్ గా అశేష ప్రేక్షకాభిమానుల ఆరాధ్య దైవంగా తెలుగు సినీ పరిశ్రమను నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలుగా ఏలేశాడు.. ఏలుతున్నాడు. ఇంతటి చిరంజీవి ఉన్నతమైన కెరీర్ కి పునాదిరాళ్లు సినిమా ద్వారా గట్టి పునాది వేసింది దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్. ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన చిరంజీవికి మొదటి అవకాశం ఇచ్చింది ఈయనే. ఆ సినిమా ద్వారానే చిరంజీవి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు.



ప్రస్తుతం ఈ దర్శకుడి ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అనారోగ్యంతో మంచాన పడి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటిలా భారీ పారితోషికాలు లేవు. పునాదిరాళ్లు తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆర్ధికంగా నిలబడలేకపోయాడు. కుటుంబపరంగా కూడా ఆయన కష్టాలు పడ్డాడని సమాచారం. కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా.. భార్య కూడా ఇటీవలే మరణించారు. దీంతో ఆయన బాగోగులు చూసేవారు కూడా లేరని.. ఒంటరిగా జీవిస్తున్నారని అంటున్నారు. వైద్యం చేయించుకునేందుకు కూడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదట. దీంతో ఈయన దీన స్థితికి పలువురు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 



ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటికి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన రాజ్ కుమార్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ కలుగక మానదు. ఆయన అవకాశం ఇచ్చిన నటులైనా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కొందరు ఇలానే ఆర్థికంగా దెబ్బ తిన్నారు. వారి దీన గాధలు ఎన్నో ప్రముఖంగా వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా పలువురిని ఇలానే ఆదుకున్న సంఘటనలను పలువురు ఉదహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: