జూనియర్ ఎన్టీయార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గత సంవత్సరం అరవింద సమేత వీరరాఘవ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. 
 
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయం. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చే క్రేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయాలంటే ఖచ్చితంగా ఒక స్టార్ డైరెక్టర్ అవసరం కాబట్టి జూనియర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. 
 
సాధారణంగా రాజమౌళి సినిమాలలో నటించే హీరోలకు ఆ తరువాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న ప్రభాస్ ఈ రెండు సినిమాల తరువాత నటించిన సాహో సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందువలన జూనియర్ ఆర్ఆర్ఆర్ తరువాత సినిమా డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ వైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. 
 
త్రివిక్రమ్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీయార్ వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబర్ 31వ తేదీన ఆర్ఆర్ఆర్ టైటిల్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ ఫస్ట్ లుక్ విడులవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ వార్తలను ధృవీకరించాల్సి ఉంది. 2020 జులై 30వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 





మరింత సమాచారం తెలుసుకోండి: