దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అన్న విషయం తెలిసిందే. కానీ తన కెరీర్లో ఎప్పుడూ భయపడని రాజమౌళి మొదటిసారి ఆర్ఆర్ఆర్ సినిమా ఫలితం విషయంలో భయపడుతున్నాడని రాజమౌళి భయపడటానికి కారణం సైరా నరసింహారెడ్డి సినిమా ఫలితం అని తెలుస్తోంది. రాజమౌళి కెరీర్లో మగధీర, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్ సినిమాలు. 
 
ఈ మూడు సినిమాలను రాజమౌళి కల్పిత కథతో తెరకెక్కించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కొంత కల్పితమే అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్ర కూడా ఈ సినిమాలో ఉంటుంది. సైరా నరసింహారెడ్డి సినిమా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రకు సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఇవెన్ అయినా మిగతా రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 
 
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరులు. ఇతర రాష్ట్రాల ప్రజలకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం గురించి ఎక్కువగా తెలియదు. నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన సినిమా ఇతర రాష్ట్రాలలో అంచనాలను అందుకోలేకపోవడంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో గత సినిమాలతో పోలిస్తే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. 
 
2020 జులై 30వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 1000 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ ఈ సినిమాలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని, ఫస్ట్ లుక్ కూడా అదే రోజు విడుదలవుతుందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: