తెలుగు భాషపైన అపరిమితమైన ప్రేమను కురిపిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తెలుగు లేకపోతే మనుగడ లేదు, జాతి చచ్చిపోయినట్లేనని భారీ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. తెలుగు భాషను కాపాడలేని వారు మట్టిలో కలిసిపోతారని కూడా శాపనార్ధాలు పెడుతున్నరు. ఇవన్నీ బాగానే ఉన్నా పవన్ తెలుగు భాషను ఎక్కడ చూస్తున్నారు. ఏం కోరుకుంటున్నారు అన్నది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్నగా ఉంది.


పవన్ బేసిగ్గా సినిమా నటుడు. మరి టాలీవుడ్లో తెలుగు భాష పరిస్థితి పవన్ ఎపుడైనా ఆలోచించారా. సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలు తెలుగు చచ్చిపోతోందని కొన్నేళ్ళుగా గోల పెడుతున్నారు. ఎందుకంటే తెలుగు పాటలు పాడేవారు ఇతర భాషల వారు, వారికి తెలుగు ఉచ్చారణ కూడా రాదు, ఇక పాటలు చూసుకుంటే మన గీత రచయితలు రాస్తున్నారో రాయిస్తున్నారో తెలియదు కానీ అక్కడ తెలుగే అసలు కనబడదు.


మరో వైపు తెలుగు సినిమాల్లో సంభాషణలు తీరు కూడా అలాగే ఉంటోంది. కధ కాకరకాయ అన్నది అసలు అడగరాదు. వీటన్నిటికీ మించి తెలుగు సినిమా టైటిల్స్ చూస్తే నూటికి తొంబై శాతం ఆంగ్ల భాషలోనే ఉంటున్నాయి.  రోబో సినిమాను తమిళ్ లో యంత్రగా పేరు  ఉంచి రిలీజ్ చేసుకున్నారు. మరి మనం ఇంగ్లీష్ లో  రోబో పేరుతోనే ఇక్కడ విడుదల చేశాం.ఇది మన భాషాభిమానం.  మరి తెలుగుకు తెగులు ఎక్కడ పట్టింది.


ఇక పవన్ మాట్లాడితే ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతారు. ఆయనే కాదు మన వారంతా తెలుగు మరచిపొయారు. ఇక పాఠశాలల్లో చూస్తే ఏపీలోనే కాదు, తెలంగాణాలో కూడా తెలుగు మీడియం చదివేది ఒక్క సర్కార్  బడుల్లోనే ఉన్నారు వారి శాతం కూడా 38 వరకూ ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువశాతం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వారంతా డబ్బున్న వారి పిల్లలు. ఇవన్నీ తెలిసిన పవన్ కళ్యాణ్ ఇపుడు తెలుగుకు తెగులు పట్టిందని గుండెలు బాదుకుంటున్నారు.


 మరి తాను పుట్టి పెరిగిన తెలుగు సినిమాలో తెలుగు చచ్చిపోతోంది. దానికి ఒక బాధ్యత గల నటుడిగా  పవన్ తన వంతుగా  ఏ మేరకు క్రుషి చేశారో చెప్పాలని మేధావులు అడుగుతున్నారు. మరి పవన్ ఇంట గెలిచి రచ్చ గెలిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే సినిమా ప్రభావాన్ని ఎవరూ కూడా తక్కువ చేయలేరు.   టాలీవుడ్లో తెలుగు భాష చచ్చిపోయింది. జనసేనానిని  గుర్తించమంటున్నారు అంతా.





మరింత సమాచారం తెలుసుకోండి: