2018, 2019 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మక ఏఎన్నార్ అవార్డ్స్‌ను శ్రీదేవి, రేఖలకు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ఈ  కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు అక్కినేని అవార్డ్స్ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, అక్కినేని నాగార్జున, బోనీ కపూర్, రేఖ, నాగ సుశీల వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న కింగ్ నాగార్జున.. నటి రేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె గురించి చాలా విషయాలు వెల్లడించారు. ఆమెకి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. వీటన్నిటినీ మొదట ప్రశాంతంగా విన్న రేఖ.. ఆ తరవాత తాను మైక్ అందుకుని నాగార్జునకు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. 

శ్రీదేవి, రేఖ ఇద్దరూ మన తెలుగు వారేనని, వీరిద్దరూ ఇండియన్ సూపర్ స్టార్స్ కావడం మనమంతా గర్వించదగిన విషయం అని నాగార్జున అన్నారు. రేఖ మొదటి సినిమా కూడా తెలుగు సినిమానే అని వెల్లడించారు. ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా రేఖ వెండితెరకు పరిచయమయ్యారని నాగార్జున చెప్పారు. అయితే, నాగార్జున చెప్పింది తప్పని రేఖ అన్నారు. ‘ఇంటిగుట్టు’ తన తొలి సినిమా అని చెప్పారు. ఆ సినిమాలో తాను ఏడాది వయసు గల పాపగా నటించానని అన్నారు. అది తమ సొంత సినిమా అని చెప్పారు. 

ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమా, పార్లల్ సినిమా ఈ రెండింటినీ ఎలా మ్యానేజ్ చేశారని.. అది చిరంజీవి, తనలాంటి హీరోల వల్ల కూడా కాలేదని రేఖను నాగార్జున అడిగారు. దీనికి రేఖ సమాధానం ఇస్తూ.. ‘‘ఇదేంటి క్వశ్చన్, ఆన్సర్స్ ఫంక్షనా.. అవార్డ్ ఫంక్షనా?’’ అని నవ్వుతూ అన్నారు. సినిమాల్లో రకాలంటూ ఏమీ లేవని సినిమా అంటే సినిమా అని చెప్పారు. సినిమాలో నటించడమే తన పని అని.. అది మంచి సినిమా, చెడ్డ సినిమా, కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కమర్షియలా, ఏ భాషలో చేస్తున్నాం అనే తేడాలు ఉండవని వెల్లడించారు.

ఇక ఆ తరవాత ఇంత అందంగా ఎలా ఉన్నారు రేఖ గారు అని నాగార్జున అడగ్గానే.. ‘‘అందం అనేది చూసేవాళ్ల కళ్లను బట్టి ఉంటుంది. మీరు ఎంత అందంగా ఉన్నారో అలాగే నేనూ ఉన్నాను. రిఫ్లెక్షనే ఇంకేం లేదు’’ అనగానే అక్కడ నవ్వులు పువ్వులు పూశాయి. నాగార్జున అయితే నవ్వుతూ రేఖకు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా మరో విషయం గురించి కూడా నాగార్జున చెప్పారు. శ్రీదేవి నటించిన ‘ఆఖరి రాస్తా’ సినిమాలో ఆమెకు హిందీ సరిగా రాకపోతే రేఖ డబ్బింగ్ చెప్పారని నాగార్జున వెల్లడించారు.

అయితే, ఇది కూడా తప్పని రేఖ అన్నారు. దీంతో నాగార్జున మైండ్ బ్లాంక్ అయిపోయింది. శ్రీదేవికి హిందీ రాక, తెలీక తాను డబ్బింగ్ చెప్పలేదని.. ఆ సమయంలో శ్రీదేవి బాగా బిజీగా ఉండటంతో తాను డబ్బింగ్ చెప్పానని వివరించారు. శ్రీదేవికి డబ్బింగ్ చెప్పడం తనకు దక్కిన అవకాశమని, తాను ఎంతో సంతోషంగా చెప్పానని అన్నారు. శ్రీదేవి చేయనిది ఏమీ లేదని, ఆమె అన్నీ చేసేశారని గొప్పగా చెప్పారు రేఖ. మొత్తం మీద ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో నాగార్జున, రేఖ మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: