హిందీ సినిమాల సీనియర్ నటుడు అనిల్ కపూర్ స్టార్ స్టేటస్ తో ఓ దశలో బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. 80, 90ల దశకాల్లో అనిల్ కపూర్ బాలీవుడ్ సూపర్ స్టార్. 1979లో హమారే తుమ్హారే అనే సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఎంతో మంది ఆయన అభిమానులు ఆయన సొంతం. కానీ ఆయన అనుభవించిన తొలి అభిమానం తెలుగు ప్రేక్షకుల నుంచేనని తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు.

 


తొలి సినిమా తర్వాత తెలుగులో బాపు దర్శకత్వంలో తెలుగు సినిమాలో నటించాడు అనిల్. ఆయన దర్శకత్వంలో నటించాలని ఓ పాత్ర ఇవ్వాలని బాపు వెంట పడ్డాడట అనిల్. తన దర్శకత్వంలో వచ్చిన వంశ వృక్షం అనే సినిమాలో అనిల్ కపూర్ కు అవకాశం ఇచ్చారు బాపు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత మరో రెండు హిందీ సినిమాలు చేశాడు. అనంతరం సాయిబాబా దర్శనార్ధం షిర్డీ వెళ్లిన అనిల్ కపూర్ తనకు మరిన్ని అవకాశాలు రావాలని తాను స్టార్ హీరో కావాలని సాయిని కోరుకున్నాడట. ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయన ఎదురుగా అప్పుడే ఓ బస్ వచ్చి ఆగిందట. కిక్కిరిసిన బస్ నుంచి దిగిన ప్రయాణికులు అనిల్ కపూర్ ను గుర్తుపట్టి తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని మీ సినిమాలు చూశాం.. మీ నటన బాగుంది అంటూ అభిమానం చూపించి ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారట.

 


దీంతో తనను స్టార్ గా అభిమానించి ఫ్యాన్ మూమెంట్ ను రుచి చూపించింది తెలుగు వారేనని చెప్పుకొచ్చాడు. తాను సాయిని ఇలా కోరుకోగానే తనను అనుగ్రహించి ఆయనే ఇలా అభిమానులను పంపించాడని భావించాడట అనిల్. ఇన్నేళ్లయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మర్చిపోకపోవడం అనిల్ కపూర్ గొప్పదనంగానే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: