క్రికెట్‌ ఆటలోగానీ, రేస్‌లోగానీ పోటీపడాలి. ముందుండాలి. లేదంటే మనం వెనకపడిపోతాం. సినిమా రేస్‌ కూడా అంతే. ఎన్ని పాత్రలు చేసినా, ఎంత సీనియర్‌ అయినా సెట్లోకి రాగానే 'ఏం పొడుస్తాడో చూడాలి' అన్నంతరీతిలో ఆలోచిస్తారు. పాత్రకు తగిన న్యాయం చేశామా! గౌరవం అలాగే వుంటుంది. లేదంటే ఇంటికెళ్ళిపోవాల్సిందే'' అని నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌ తెలియజేశారు. 'ఆ నలుగురు', 'మీశ్రేయోభిలాషి', 'మహానటి' తదితర చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన 'తోలుబొమ్మలాట' చిత్రంలో సోడాల రాజుగా నటించారు. మాగంటి విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల22న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.


'తోలు బొమ్మలాట' దేని గురించి?
మనిషి జీవితమే ఓ తోలు బొమ్మలాట. నిజంగా చెప్పాలంటే మనం తోలు ఉన్న బొమ్మలం. మనతో ఆ దేవుడు ఆట ఆడిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో మన తల్లి దండ్రులు, గురువు కూడా మనతో తోలు బొమ్మలాట ఆడతారు. అదే ఈ తోలు బొమ్మలాట.


ఈ కథ విన్నాక ఏమనిపించింది?
దర్శకుడు విశ్వనాధ్‌ నన్ను కలిసి మీకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే కథ ఉందని చెప్పాడు. ఏదైనా కామెడీ ఫ్లేవర్‌తో ఉండే కథ అయి ఉంటుందేమో అని ఊహించాను. కట్‌ చేస్తే, వృద్దాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనలు, అతని బాధతో కూడిన ఓ ఎమోషనల్‌ కథ చెప్పాడు. విన్నాక ఆశ్చర్యమేసింది. నీ వయసెంత అని అడిగాను! ఆ తర్వాత ఈ కథ నువ్వే రాశావా? నువ్వే తీస్తావా? అని కూడా అడిగి తెలుసుకున్నాను. నిజంగా ఈ వయసులో అలాంటి కథ రాయడం గొప్ప విషయం. నాకు చెప్పినట్టే మంచి సినిమా సినిమా తీశాడు.


భిన్నమైన పాత్రలు చేసిన మీకు ఈ పాత్ర ఎలా అనిపించింది?
ఏ సినిమాలో అయినా నటుడు అనే వాడు కనిపించకుండా పాత్ర కనిపించాలి. అప్పుడే సన్నివేశాలు పండుతాయి. నటుడిగా ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. సినిమాలో 'సోడా రాజు'గా కనిపించడానికి కొంత ప్రిపైర్‌ అవ్వడం జరిగింది. నాకు దొరికిన మరో మంచి పాత్ర. ఊళ్ళో వాళ్ళు సోడాల రాజు దగ్గరికి వెళ్తే టెన్షన్‌ రిలీఫ్‌ అవుతుంది రా! అనుకునేలాంటి పాత్ర.


మోషన్‌ పోస్టర్‌లో కాకి పిండం తినడం వంటివి చూపించారు? సంప్రదాయాలు చెప్పారా?
ఇది ఎమోషన్‌తో కూడిన సినిమా. ఒకప్పుడు మనం పాటించిన పద్దతులు ఇప్పుడు వదిలేయడం గురించి కూడా ఓ చిన్న సందేశం ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


మీరు సహనటులకు సలహాలు ఇస్తుంటారా?
సినిమా కథ ఎమోషనల్‌ జర్నీ అయినా కామెడీ కూడా ప్రాదాన్యం ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమాకు హైలైట్‌. బాగా చేశాడు. ఎప్పటికప్పుడు నన్ను సలహాలు అడుగుతూ ఎంతో చక్కగా ఆ పాత్రను చేశాడు. కిషోర్‌ పాత్ర అందరినీ బాగా నవ్విస్తుంది. తోటి ఆర్టిస్టు సహకరిస్తేనే సీన్‌ బాగా పండుతుంది. అలా మా ఇద్దరి కాంబినేషన్‌ పండిందనే చెప్పాలి.


చేసిన పాత్రలే చేస్తుంటే బోర్‌ అనిపించలేదా?
నటుడిగా నలబై ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఇంకా కంటిన్యూ అవ్వడానికి నాకు వస్తున్న పాత్రలు పనిచేసే సిబ్బందే కారణం. అందుకే ఇప్పటికీ నాకు నటన అంటే బోర్‌ కొట్టట్లేదు. రాజేంద్రప్రసాద్‌ చాలా సీనియర్‌ కదా ఎప్పటి నుండో ఉన్నాడు అనుకోవడానికి లేదు. ఇప్పటికీ ఏదైనా కథ విన్నాక కచ్చితంగా ఓ రెండు మూడు గంటలు ఆ పాత్ర గురించి ఆలోచిస్తూ ప్రిపేర్‌ అవుతుంటా. ఆ సమయంలో మా ఇంట్లో వాళ్ళెవరూ నా దగ్గరికి కూడా రారు. ఇక సెట్‌కి వెళ్ళాక కూడా ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తుంటా.


నటకిరీటికి వారసులు ఎవరని మీరు భావిస్తున్నారు?
    ఎవరి నటన వారిదే. చాలామంది నటులు తమదైన రీతిలో నటిస్తున్నారు. నాకు  వారసులు ఎవ్వరూ లేరు. నా కొడుకు నటుడ్ని చేయాలని వున్నా. స్వతహాగా అతనికి వుండాలిగదా. నేను స్వతహాగా వచ్చినవాడినే. నా తల్లిదండ్రుల కోరిక నన్ను నటుడ్ని చేయడంకాదు. అలానే చాలామంది బలవంతంగా రుద్దినా నటులుకాలేకపోతున్నారు అది మీరు చూస్తూనే వున్నారు. ఇక నా మనవరాలు 'మహానటి'లో నటించింది. పలు చిత్రాల్లో నటిస్తుందికూడా. స్పురద్రూపి. ఆడుతూపాడుతూ పాత్రను చేసేస్తుందని నాగ్‌ అశ్విన్‌ కితాబిచ్చారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

మహేశ్‌ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో మహేశ్‌, నేను టామ్‌ అండ్‌ జెర్రీలాగా కనిపిస్తాం. 20నుంచి నార్త్‌లో యాక్షన్‌ సీన్‌ చేయాల్సి వుంది. ఇక బన్నీ 'అల వైకుంఠపురములో' ఓ పోలిస్‌ పాత్ర చేస్తున్నాను. ఇంకా నాలుగైదు సినిమాలు రన్నింగ్‌లో వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: