నవంబర్ 20.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే.. వారు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్న సస్పెన్స్ వీడిపోనుంది. ఈ విషయంపై ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఓ సందేశం పంపింది. అందులో ఏముందంటే..

 

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటివరకూ సాగిన ఊహాగానాలకు తెరపడే సమయం వచ్చేసింది. తారక్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయాన్ని నవంబరు 20న వెల్లడిస్తాం. అంతేకాదు, ప్రతినాయకుల పాత్రల వివరాలు కూడా చెబుతామని ప్రకటించింది.

 

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోందీ సినిమా. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఒక హీరో రామ్‌చరణ్‌కు జోడీగా అలియాభట్‌ ఎప్పుడో ఖాయమైపోయింది. కానీ తారక్‌ సరసన ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

 

మొదట్లో హాలీవుడ్‌ నటి డైసీ ఎడ్గారీ జోన్స్‌ను తీసుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆమె చిత్రం నుంచి ఔైట్ అయ్యింది. అప్పటి నుంచి తారక్‌ సరసన ఎవరు నటిస్తారు అన్న ప్రశ్నకు జవాబు దొరకనే లేదు. ఈ సస్పెన్స్ కు తెర దించేందుకు ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ముందుకొచ్చింది. బుధవారం వివరాలు వెల్లడిస్తామని టీం ఆర్‌ఆర్‌ఆర్‌ తెలిపింది. దీంతో తారక్‌ సరసన ఎవరు నటిస్తారన్నది ఇవాళ తేలిపోతుందన్నమాట.

 

ఆర్.ఆర్.ఆర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తారక్, రామ్ చరణ్ లతో పాటు అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: