ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ ఈరోజు ప్రముఖ రామానాయుడు స్టూడియోలో తెల్లవారుజామున తనిఖీలు చేపట్టింది. సురేశ్ బాబు కార్యాలయంలో, నివాసంలో ఒకే సమయంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నేచురల్ స్టార్ నాని ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం. 
 
ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని నాని కార్యాలయంతో పాటు, నాని నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 10 చోట్ల ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో బాగా గుర్తింపు పొందిన వారి ఇళ్లలో మరియు కార్యాలయాల్లో దాడులు జరగటం గమనార్హం. ఐటీ అధికారులు రోటీన్ గానే తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు. 
 
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం V అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అష్టాచమ్మా, జెంటిల్ మేన్ సినిమాలు వచ్చాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నివేదా థామస్, అదితీరావు హైదరీ, సుధీర్ బాబు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
గత కొంత కాలంగా నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కావట్లేదు. ఈ సంవత్సరం విడుదలైన జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా హిట్ కాలేదు. నాని ప్రస్తుతం నటిస్తున్న V సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. V సినిమా నాని హీరోగా నటిస్తున్న 25వ సినిమా కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: